IND vs ENG : ఓవల్ టెస్టులో శతకంతో జట్టుకు భారీ స్కోర్ అందించిన ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (118 ) ఇన్నింగ్స్ ముగిసింది. టంగ్ ఓవర్లో తన ఫేవరెట్ అప్పర్కట్ ఆడబోయిన అతడు బౌండరీ వద్ద ఓవర్టన్ చేతికి చిక్కాడు. దాంతో, 273 వద్ద ఆరో వికెట్ పడింది. ప్రస్తుతం రవీంద్ర జడేజా(24 నాటౌట్), ధ్రువ్ జురెల్(1 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 255 పరుగుల ఆధిక్యంలో ఉంది. వీరిద్దరూ టీ సెషన్ వరకూ నిలబడితే.. భారత్ మ్యాచ్‌ను శాసించడం ఖాయం.
లంచ్ తర్వాత సెంచరీతో చెలరేగిన యశస్వీ.. కండరాలు పట్టేయడంతో ఇబ్బందిపడుతూనే బ్యాటింగ్ కొనసాగించాడు. ఉన్నంత సేపు డిఫెన్స్‌తో ఆకట్టుకున్న కరుణ్ నాయర్(17) కీపర్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన రవీంద్ర జడేజానే స్ట్రయిక్ ఎక్కువగా తీసుకొని యశస్వీకి ఉపశమనం కలిగించాడు. కానీ.. టంగ్ ఓవర్లో అప్పర్ కట్‌తో సిక్సర్ కొట్టాలనుకున్న అతడు టైమింగ్ కుదరక ఓవర్టన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. నిన్నటి నుంచి విసిగిస్తున్న యశస్వీ వికెట్ పడిన వేళ ఇంగ్లండ్ ఆటగాళ్లు సంబురాల్లో మునిగిపోయారు. ప్రధాన బ్యాటర్లు పెవిలియన్ చేరడంతో ఆధిక్యాన్ని మరింత పెంచాల్సిన బాధ్యత మాంచెస్టర్ టెస్టు హీరోలు జడేజా, సుందర్‌లతో పాటు జురెల్పైనే ఉంది.