e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home స్పోర్ట్స్ కూర్పు కుదిరేనా

కూర్పు కుదిరేనా

  • నేడు భారత్‌, ఇంగ్లండ్‌ వామప్‌ మ్యాచ్‌
  • టీ20 ప్రపంచకప్‌

నిన్న మొన్నటి వరకు రోహిత్‌ శర్మను ఎలా ఔట్‌ చేయాలని విరాట్‌ కోహ్లీ.. లోకేశ్‌ రాహుల్‌ పరుగుల ప్రవాహానికి ఎలా ముకుతాడు వేయాలని జస్ప్రీత్‌ బుమ్రా పన్నిన వ్యూహాలు పక్కనపెట్టి.. భారత ఆటగాళ్లంతా ప్రపంచాన్ని జయించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 23 నుంచి ప్రధాన పోటీలు ప్రారంభం కానుండగా.. అంతకుముందు టీమ్‌ఇండియా రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడనుంది. రోహిత్‌ శర్మతో కలిసి ఓపెనింగ్‌ చేసేదెవరు.. పేస్‌ ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ పాండ్యాకు అవకాశం వస్తుందా.. లేక శార్దూల్‌ను పరిశీలిస్తారా అనేది నేడు ఇంగ్లండ్‌తో జరుగనున్న తొలి వామప్‌ మ్యాచ్‌లో తేలిపోనుంది!

దుబాయ్‌: సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటికే మెరుపులు మొదలవగా.. టీమ్‌ఇండియా నేడు తొలి ప్రాక్టీస్‌ మ్యాచ్‌ బరిలోకి దిగనుంది. ఈ మెగాటోర్నీ తర్వాత పొట్టి ఫార్మాట్‌ సారథ్యానికి వీడ్కోలు పలుకుతున్నట్లు ముందే ప్రకటించిన విరాట్‌ కోహ్లీకి కప్పును బహుమతిగా ఇవ్వాలని జట్టు సభ్యులు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా.. బ్యాటింగ్‌ ఆర్డర్‌లోని సమస్యలను అధిగమించడంపై కోచింగ్‌ స్టాఫ్‌ దృష్టి పెట్టింది. ఐపీఎల్‌ రెండో దశ కారణంగా ఆటగాళ్లంతా మంచి టచ్‌లో ఉండగా.. తుది జట్టు ఎంపిక విషయంలో భారత్‌కు కొన్ని సమస్యలున్నాయి. వాటిని అధిగమించేందుకు ఈ వామప్‌ మ్యాచ్‌లను వినియోగించాలని భావిస్తున్న మేనేజ్‌మెంట్‌.. హార్దిక్‌ పాండ్యా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరం. తాజా ఐపీఎల్‌లో బౌలింగ్‌కు దూరంగా ఉన్న ఈ స్టార్‌ ఆల్‌రౌండర్‌ మెగాటోర్నీలోనూ కేవలం బ్యాటర్‌గానే బరిలోకి దిగుతాడా లేక తన కోటా పూర్తి చేస్తాడా చూడాలి. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించేదెవరనే దానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. లోకేశ్‌ రాహుల్‌కు ఆ చాన్స్‌ దక్కుతుందా లేక యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ వైపు మొగ్గు చూపుతారా అనేది చూడాలి.

- Advertisement -

ఫుల్‌ ప్రాక్టీస్‌తో..
ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌ నుంచి నేరుగా యూఏఈలో అడుగుపెట్టిన టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఇప్పటికే స్థానిక పరిస్థితులను ఆకలింపు చేసుకోగా.. ఐపీఎల్‌ ద్వారా వాళ్లందరికీ మంచి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కూడా లభించింది. ఇక కూర్పు కూడా కుదిరితే కోహ్లీసేనకు తిరుగుండదు. ప్రధాన టోర్నీలో ఈ నెల 24న దాయాది పాకిస్థాన్‌తో భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడనుండగా.. సోమవారం ఇంగ్లండ్‌తో జరిగే పోరులో బ్యాటింగ్‌ ఆర్డర్‌ను సెట్‌ చేసుకోవాలని చూస్తున్నది! ఓపెనింగ్‌ స్థానం కోసం రాహుల్‌, ఇషాన్‌ మధ్య పోటీ నెలకొనగా.. తాజా ఐపీఎల్‌ ఫామ్‌తో పాటు అనుభవం రాహుల్‌ వైపు మొగ్గు చూపేలా చేయనున్నది. ఇషాన్‌ కిషన్‌ కూడా తానాడిన చివరి రెండు మ్యాచ్‌ల్లో అర్ధశతకాలతో సత్తాచాటడం మేనేజ్‌మెంట్‌ను ఇరకాటంలో పడేసింది. అయితే ఇషాన్‌ను ఫినిషర్‌లా వినియోగించుకునే అవకాశాన్ని కొట్టి పారేయలేం. ఇక మరోవైపు హార్దిక్‌ పాండ్యా ఫిట్‌నెస్‌ టీమ్‌కు తలనొప్పిగా మారింది. వెన్నెముక శస్త్రచికిత్స అనంతరం బౌలింగ్‌కు దూరంగా ఉంటున్న హార్దిక్‌.. మెగాటోర్నీలో ఆల్‌రౌండర్‌ పాత్ర పోషించగలడా లేదా చూడాలి. స్పిన్‌ కోటాలో రవీంద్ర జడేజా జట్టులో ఉండటం పక్కా కాగా.. రెండో స్పిన్నర్‌గా వరుణ్‌ చక్రవర్తికి మెరుగైన అవకాశాలున్నాయి. మూడో స్పిన్నర్‌ తీసుకోవాలనుకుంటేనే రవిచంద్రన్‌ అశ్విన్‌, రాహుల్‌ చాహర్‌లో ఒకరికి అవకాశం దక్కొచ్చు. అయితే ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో వీళ్లందరినీ పరీక్షించాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నది. పేస్‌ విభాగంలో జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, మహమ్మద్‌ షమీ ముందు వరుసలో ఉండగా.. బ్యాటింగ్‌లోనూ ఓ చేయి వేయగల శార్దూల్‌ ఠాకూర్‌కు చాన్స్‌ వస్తుందేమో చూడాలి! మరోవైపు జాసన్‌ రాయ్‌, జానీ బెయిర్‌స్టో, డేవిడ్‌ మలన్‌, జోస్‌ బట్లర్‌, మొయిన్‌ అలీ, ఇయాన్‌ మోర్గాన్‌తో కూడిన ఇంగ్లండ్‌ కూడా ఈ మ్యాచ్‌లో తమ అస్త్రశస్ర్తాలను పరిశీలించుకోవాలని భావిస్తున్నది!

రంగంలోకి దిగిన ధోనీ
మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ టీమ్‌ఇండియా మెంటార్‌గా తన పని ప్రారంభించాడు. ఇంగ్లండ్‌తో వామప్‌ మ్యాచ్‌ కోసం భారత జట్టు ఆదివారం ప్రాక్టీస్‌ చేయగా.. అందులో మహీ పాల్గొన్నాడు. హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రితో పాటు సహాయక సిబ్బందితో ధోనీ సుదీర్ఘంగా చర్చించగా.. మిస్టర్‌ కూల్‌ రాకను బీసీసీఐ స్వాగతించింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement