నెలన్నర రోజులుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఐపీఎల్లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. లీగ్ దశ ముగిసి ప్లేఆఫ్స్ పోరుకు వేళయైంది. ప్రత్యర్థులపై అద్భుత విజయాలతో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టాప్-2లో నిలిచిన పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) నేడు క్వాలిఫయర్-1లో అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. గతానికి పూర్తి భిన్నంగా సమిష్టి ప్రదర్శన కనబరుస్తూ అగ్రస్థానంలో నిలిచిన జట్టు పంజాబ్ అయితే, ఈసారైనా తమ కలల కప్‌ను ముద్దాడాలని లక్ష్యంగా పెట్టుకున్నది ఆర్సీబీ. సమవుజ్జీలుగా కనిపిస్తున్న పంజాబ్, ఆర్సీబీ ముల్లాన్‌పూర్‌లో ఢీ అంటే ఢీ అనడానికి సర్వశక్తులతో సిద్ధమయ్యాయి. సొంత ఇలాఖాలో సత్తాచాటి తొలి ఫైనల్ బెర్తును దక్కించుకోవాలని పంజాబ్ చూస్తుంటే, లక్నోపై విజయమిచ్చిన కిక్‌తో ఆర్సీబీ.. పంజాబ్‌కు చెక్ పెట్టాలని చూస్తున్నది. లీగ్‌లో రెండు అత్యుత్తమ జట్ల మధ్య పోరు అభిమానులను అలరించడం ఖాయంగా కనిపిస్తున్నది.
IPL | ముల్లాన్‌పూర్(చండీగఢ్): ఐపీఎల్లో కీలకమైన ప్లేఆఫ్స్‌కు మరికొద్ది గంటల్లో తెరలేవబోతున్నది. చండీగఢ్‌లో కొత్తగా రూపుదిద్దుకున్న ముల్లాన్‌పూర్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ మధ్య గురువారం క్వాలిఫయర్-1 పోరు జరుగనుంది. లీగ్ దశలో ప్రత్యర్థులపై అద్భుత విజయాలతో పంజాబ్, ఆర్సీబీ టాప్-2 బెర్తులు ఖరారు చేసుకున్నాయి. ఇదే జోరులో తమకు అందని ద్రాక్షగా ఊరిస్తూ వస్తున్న ఐపీఎల్ టైటిల్‌ను ఎలాగైనా ఒడిసిపట్టుకునేందుకు పంజాబ్, బెంగళూరు పావులు కదుపుతున్నాయి. 2014లో పంజాబ్ చివరిసారి ఫైనల్ చేరితే, 2016లో ఆర్సీబీ తుదిపోరులో నిలిచింది.
ఇలా రెండు జట్లకు ఐపీఎల్ టైటిల్ అనేది ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది. 18 ఏండ్ల ఐపీఎల్ సుదీర్ఘ చరిత్రలో ఈ రెండు జట్లను టైటిల్ ఊరిస్తూనే ఉన్నది. అయితే ఈసారి ఎలాగైనా చరిత్ర తిరుగరాయాలన్న కసితో ఉన్న పంజాబ్, బెంగళూరు ఆ దిశగా అడుగులు ముందుకేస్తున్నాయి. గత సీజన్ల లాగే ఈసారి కూడా అంతే అనుకున్న అభిమానుల అంచనాలను పూర్తిగా తలకిందులు చేస్తూ పంజాబ్, ఆర్సీబీ లీగ్ స్వరూపానే మార్చేశాయి. యువకులు, అంతర్జాతీయ స్టార్ల మేళవింపుతో కనిపిస్తున్న ఈ రెండు జట్లు టైటిల్ వేటలో ముందంజ వేసేందుకు పక్కా ప్రణాళికతో ఉన్నాయి.
పంజాబ్, ఆర్సీబీ మధ్య పోరును శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బెంగళూరును వారి సొంతగడ్డపై ఓడించిన పంజాబ్‌కు కోహ్లీ ముల్లాన్‌పూర్‌లో ఏకపక్ష విజయంతో దీటైన సమాధానమిచ్చాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య పోరు సై అంటే సై అన్నట్లు సాగే అవకాశముంది. దీనికి తోడు తమ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ ఇద్దరు కీలక భూమిక పోషిస్తున్నారు. లీగ్‌లో ఇప్పటి వరకు కోహ్లీ(608 పరుగులు, స్ట్రైక్‌రేట్ 147.91), అయ్యర్(514 పరుగులు, స్ట్రైక్‌రేట్ 171.90)తో పరుగుల వేట కొనసాగిస్తున్నారు. క్వాలిఫయర్-1లోనే వీరిద్దరు ఇదే జోరు కొనసాగిస్తే అభిమానులకు పండుగే.
ఇదిలా ఉంటే రెండు జట్లు దాదాపు ఒకే రకమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. డబ్ల్యూటీసీ కారణంగా పంజాబ్‌కు దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్ యాన్సెన్ దూరమైతే..గాయంతో టిమ్ డేవిడ్ క్వాలిఫయర్-1 ఆడేది అనుమానంగా మారింది. మరోవైపు గాయం నుంచి తేరుకున్న చాహల్ తిరిగి రావడం పంజాబ్‌కు లాభించే అంశం కాగా హాజిల్‌వుడ్ రాక..ఆర్సీబీకి మంచి కిక్కిచ్చే చాన్స్ ఉంది. మొత్తంగా క్వాలిఫయర్-1లో గెలిచి తొలి ఫైనల్ బెర్తు దక్కించుకునేది ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం దొరకనుంది.
పంజాబ్: ప్రియాంశ్, ప్రభ్‌సిమ్రన్‌సింగ్, ఇంగ్లిస్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నేహాల్ వధేరా, శశాంక్సింగ్, స్టొయినిస్, అజ్మతుల్లా, జెమీసన్, హర్‌ప్రీత్, అర్ష్‌దీప్‌సింగ్, చాహల్.
బెంగళూరు: కోహ్లీ, సాల్ట్, మయాం క్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేశ్శర్మ, కృనాల్పాండ్యా, లివింగ్‌స్టోన్, షెఫర్డ్, భువనేశ్వర్, దయాల్, హాజిల్‌వుడ్, సుయాశ్.