ముంబై: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పినట్లు.. తెలంగాణ కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మలో జాతీయ జట్టుకు ఆడే సత్తా ఉందని బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తిలక్.. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆడుతున్నాడని గవాస్కర్ ప్రశంసించాడు. ‘తిలక్ వర్మ టెంపర్మెంట్ బాగుంది. చెన్నైతో మ్యాచ్‌లో తీవ్ర ఒత్తిడి మధ్య అతడు క్రీజులో అడుగుపెట్టాడు. తొలుత ఒకటి రెండు పరుగులతో స్ట్రయిక్ రొటేట్ చేసిన తిలక్.. కుదురుకున్నాక చక్కటి షాట్లు ఆడుతూ పరిణతి కనబర్చాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా స్ట్రయిక్ రొటేట్ చేయడం చాలా ముఖ్యం. దాన్ని తిలక్ చక్కగా నిర్వర్తిస్తున్నాడు.
స్ట్రెయిట్ బ్యాట్ వినియోగించడం ద్వారా ఎలాంటి బంతినైనా అలవోకగా ఎదుర్కొంటున్నాడు. రోహిత్ శర్మ చెప్పినట్లుగా తిలక్ అన్ని ఫార్మాట్లకు తగ్గ ప్లేయర్. జాతీయ జట్టు తరఫున కచ్చితంగా ఆడుతాడు. అయితే ఇంకొన్ని అంశాలపై దృష్టి పెట్టాలి. మరీ ముఖ్యంగా ఫిట్నెస్ కాపాడుకోవాలి. అప్పుడే హిట్‌మ్యాన్ మాటలు నిజం చేయగలడు’ అని గవాస్కర్ సూచించాడు. కాగా ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో తీవ్రంగా నిరాశ పరిచింది. కెప్టెన్ రోహిత్ పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడుతుండగా.. మిడిలార్డర్లో జట్టు వెన్నెముక లాంటి సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా లీగ్‌కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో వరుస అవకాశాలు దక్కించుకున్న హైదరాబాదీ తిలక్ వర్మ చక్కటి ఆటతీరుతో దిగ్గజాల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. తిలక్ ఇదే జోరు కొనసాగిస్తే.. వచ్చే నెల స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగనున్న టీ20 సిరీస్‌కు భారత సెలెక్టర్లు అతడి పేరు పరిశీలించే అవకాశాలున్నాయి.