ముంబై: ఇటలీ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన సంద ర్భం! ఈ ఆటలో ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న ఇటలీ.. వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న టీ20 వరల్డ్ కప్‌నకు అర్హత సాధించి చరిత్ర సృష్టించింది. యూరోపియన్ సబ్ రీజినల్ క్వాలిఫయర్స్ నుంచి ఇటలీతో పాటు నెదర్లాండ్స్ మెగా టోర్నీ కి అర్హత సాధించాయి. క్రికెట్లో ఏ ఫార్మాట్లో అయి నా ప్రపంచకప్‌నకు అర్హత సాధించడం ఇటలీకి ఇదే తొలిసారి కావడం విశేషం.
నిర్లక్ష్యం.. బాధ్యతారాహిత్యం ; బెంగళూరు ఘటనపై నివేదికలో వెల్లడి
బెంగళూరు: గత నెలలో తమ తొలి ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయోత్సవ వేడుక సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏర్పాటుచేసిన జ్యుడిషియల్ కమిషన్ కీలక విషయాలను వెల్లడించింది. ఈ ఘటనకు ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ), ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డీఎన్ఎ ఎంటర్టైన్మెంట్, బెంగళూరు పోలీసుల నిర్లక్ష్యంతో పాటు వారి బాధ్యతారాహిత్యమే కారణమని రిటైర్డ్ జస్టిస్ జాన్ మైఖెల్ డికున్హా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ పేర్కొంది. అంత తక్కువ సమయంలో ఈవెంట్‌ను నిర్వహించడం కష్టమని తెలిసినా పోలీసులు విధి నిర్వహణలో పూర్తి నిర్లక్ష్య ంగా వ్యవహరించారని నివేదిక తెలిపింది. ఆర్సీబీ విజయోత్సవాల వేళ చిన్నస్వామిలో లక్షలాదిగా తరలివచ్చిన అభిమానులను అదుపు చేయడానికి స్టేడియం లోపల 79 మంది పోలీసులు మాత్రమే ఉన్నారని, బయట ఎవరూ లేరని.. దీనిలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నదని వెల్లడించింది. ప్రస్తుతం సీఎం సిద్ధరామయ్యకు అందజేసిన ఈ నివేదికను ఈ నెల 17న రాష్ట్ర క్యాబినెట్ ముందుకు తీసుకురానున్నట్టు సమాచారం.