తన ఫామ్ గురించి వస్తున్న విమర్శలపై టీమిండియా స్టార్ ఓపెనర్, ప్రస్తుతం వెస్టిండీస్ సిరీస్‌లో యువ భారత్‌ను నడిపిస్తున్న శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విమర్శకులు పదేండ్లుగా తనను విమర్శిస్తూనే ఉన్నారని, తాను వింటూనే ఉన్నానని అతడు అన్నాడు. వాటిని తాను పట్టించుకోనని, ఒకవేళ అలా చేసి ఉంటే ఇక్కడిదాకా చేరేవాడిని కాదని చెప్పుకొచ్చాడు.
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు ధావన్ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడికి తన ఫామ్‌పై వస్తున్న విమర్శలపై ప్రశ్న ఎదురైంది. దీనికి ధావన్ సమాధానం చెబుతూ.. ‘అది నాకేం కొత్తకాదు. గడిచిన పదేండ్లుగా అవి నేను వింటూనే ఉన్నా. వాళ్లు (విమర్శకులు) నా గురించి ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. నేను ఆడుతూనే ఉన్నా. నేను అసలు వాటిని పట్టించుకోను. ఒకవేళ నేను పట్టించుకొని ఉంటే ఇప్పుడు ఇక్కడ ఉండేవాడిని కాదు.
ఎవరికైనా వారి స్వంత అభిప్రాయాలు ఉంటాయి. కానీ నేనేం చేయాలో నాకు తెలుసు. కొన్ని మ్యాచ్‌లలో విఫలమైన దానిని నేను అంత సీరియస్‌గా తీసుకోను. నన్ను నేను ఆత్మ విమర్శ చేసుకుని ముందుకు సాగుతా. నాకు అదే ముఖ్యం..’ అని తెలిపాడు.
ఇక యువ ఆటగాళ్లతో కలిసి ఆడటం తానెప్పుడూ ఆస్వాదిస్తానని ధావన్ అన్నాడు. ఈ క్రమంలో తన అనుభవాన్ని వాళ్లతో పంచుకుంటానని చెప్పాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఒత్తిడి సహజమని, దానివల్ల తన మైండ్ సెట్ ఏమీ మారదని అతడు చెప్పుకొచ్చాడు. గ్రౌండ్లోకి దిగిన ప్రతీసారి విజయం సాధించాలనే భావనతో ఆడతామని ధావన్ వివరించాడు.