హైదరాబాద్, ఆట ప్రతినిధి: సీఎం కప్-2024 కోసం రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్) సన్నాహాలు మొదలుపెట్టింది. త్వరలో నిర్వహించబోయే టోర్నీ కోసం క్రీడా సంఘాల ప్రతినిధులతో సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి గురువారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టోర్నీ విజయవంతం కోసం క్రీడా సంఘాల సహకారం అవసరమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘గ్రామీణ యువ క్రీడా ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సీఎం కప్ నిర్వహిస్తున్నాం. మొత్తం నాలుగు అంచెల్లో(గ్రామీణ, మండల, జిల్లా, రాష్ట్ర) పోటీలు నిర్వహిస్తాం. ఇందుకోసం సాంకేతికంగా, నిర్వహణ పరంగా క్రీడా సంఘాల మద్దతు అవసరం.
టోర్నీలో పారా క్రీడాంశాలకు కూడా తగిన ప్రాధాన్యమిస్తాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సాట్స్ ఎండీ సోనీబాలదేవి, డీడీలు చంద్రారెడ్డి, రవీందర్, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.