ఫార్మాట్‌తో సంబంధం లేకుండా.. బరిలోకి దిగితే దుమ్మురేపడమే పరమావధిగా సాగే విరాట్ కోహ్లీ చాన్నాళ్ల తర్వాత పొట్టి క్రికెట్లో అడుగుపెడుతున్నాడు. గత టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ ఫార్మాట్‌కు విరామమిచ్చిన కింగ్.. 14 నెలల తర్వాత టీమ్ఇండియా తరఫున టీ20 మ్యాచ్ ఆడనున్నాడు. అఫ్గానిస్థాన్‌తో ఆదివారం జరగనున్న రెండో టీ20లో రోహిత్, విరాట్ దంచికొట్టేందుకు సిద్ధమైతే.. కాబూలీలు స్పిన్‌తో భారత్‌ను తిప్పలు పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మరి టీమ్ఇండియా ఇండోర్‌లోనే ఇరగదీసి సిరీస్ పట్టేస్తుందా.. లేక ప్రత్యర్థి పైచేయి సాధిస్తుందా చూడాలి!
Ind Vs Afg t20 | ఇండోర్: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో.. భారత జట్టు అందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలెట్టింది. చాన్నాళ్లుగా ఈ పార్మాట్‌కు దూరంగా ఉంటున్న సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌కు ఎంపిక చేసింది. తొలి మ్యాచ్‌కు వ్యక్తిగత కారణాలతో దూరమైన కోహ్లీ.. ఆదివారం జరగనున్న రెండో పోరుకు అందుబాటులో ఉండనున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌పై అంచనాలు పెరిగిపోగా.. 14 నెలల తర్వాత విరాట్ భారత్ తరఫున టీ20 మ్యాచ్ ఆడనున్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొహాలీలో అఫ్గాన్‌పై అలవోక విజయం సాధించిన రోహిత్ సేన అదే జోరులో సిరీస్ పట్టేయాలని చూస్తుంటే.. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అందుబాటులో లేకున్నా.. స్పిన్ అస్త్రంతోనే టీమ్ఇండియాను ఇబ్బంది పెట్టాలని అఫ్గాన్ ఆలోచిస్తున్నది. గాయం కారణంగా గత మ్యాచ్‌కు అందుబాటులో లేకపోయిన యశస్వి జైస్వాల్ ఫిట్నెస్ సాధించాడు.
ఒపెనింగ్ స్థానం కోసం గిల్, జైస్వాల్ మధ్య పోటీ ఉండనుంది. అనూహ్యంగా రోహిత్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ ఆరంభించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. వరల్డ్‌కప్‌నకు ముందు టీమ్ఇండియా మరో రెండు టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడనుండటంతో.. జట్టు కూర్పు సరిచూసుకునేందుకు ఈ మ్యాచ్ ఉపయోగపడనుంది. కోహ్లీ రాకతో హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ చోటు గల్లంతయ్యేలా కనిపిస్తున్నది. మిడిలార్డర్లో యువ ఆటగాళ్లు శివమ్ దూబే, రింకూసింగ్, జితేశ్ శర్మ సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నారు. బౌలింగ్‌లో మరోసారి ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల ప్లాన్‌కే పరిమితం కావచ్చు. పేసర్లుగా అర్ష్‌దీప్, ముఖేశ్ ఖాయమే కాగా.. అక్షర్, సుందర్, బిష్ణోయ్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. కుల్దీప్ను కూడా పరిశీలించవచ్చు. మరోవైపు.. తొలి మ్యాచ్‌లో మంచి పోటీనిచ్చిన అఫ్గాన్ ఈ సారి టీమ్ఇండియా స్టార్లను అడ్డుకోవాలని భావిస్తున్నది.
భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్/జైస్వాల్, కోహ్లీ, దూబే, రింకూ, జితేశ్, అక్షర్, సుందర్, కుల్దీప్/రవి, అర్ష్‌దీప్, ముఖేశ్.
అఫ్గానిస్థాన్: ఇబ్రహీం (కెప్టెన్), రహ్మానుల్లా, హష్మతుల్లా, అజ్మతుల్లా, నబీ, నజీబుల్లా, కరీమ్, నైబ్, ముజీబ్, నవీన్, ఫజల్
ఇండోర్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం.. గతంలో ఇక్కడ జరిగిన మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. బౌండ్రీ చిన్నది కావడంతో పరుగుల పండగే. మొహాలీలో చలితో తీవ్రంగా ఇబ్బంది పడిన ఆటగాళ్లకు ఇక్కడ వేడి వాతావరణం స్వాగతం పలకనుంది.