లండన్: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య యాషెస్ రెండో టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న ఆసీస్..రెండో టెస్టుపై మరింత పట్టుబిగించింది. మూడో రోజు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్ 130 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొంటూ ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజ(58 నాటౌట్) అజేయ అర్ధసెంచరీతో కదంతొక్కాడు. ఖవాజతో కలిసి స్మిత్(6) క్రీజులో ఉన్నాడు.
చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్న ఆసీస్ ప్రస్తుతం 221 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నది. మరో రెండు రోజులు మిగిలున్న టెస్టులో ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలనే పట్టుదలతో కంగారూలు కనిపిస్తున్నారు. జాన్ టాంగ్(1/21) బౌలింగ్‌లో వార్నర్(25) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. లబుషేన్(30)ను అండర్స్‌న్ పెవిలియన్ పంపాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 278/4 తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్ 325 పరుగులకు ఆలౌటైంది. స్టార్క్ (3/88), హెడ్ (2/17), హాజిల్‌వుడ్(2/71) ధాటికి ఇంగ్లండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఆసీస్ బౌలింగ్ ధాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 325 ఆలౌట్(డకెట్ 98, బ్రూక్ 50, స్టార్క్ 3/88, హెడ్ 2/17), ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 130/2(ఖవాజ 58 నాటౌట్, లబుషేన్ 30, టాంగ్ 1/21, అండర్సన్ 1/41)