Pak Cricketers | హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ కోసం భారత గడ్డపై కాలుమోపిన పాకిస్థాన్ బృందానికి ఘన స్వాగతం లభించింది. భారీ భద్రత నడుమ బాబర్ ఆజమ్ సేన బుధవారం రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టింది. ఇండియాలో తమకు ఈ స్థాయిలో ఆహ్వానం లభిస్తుందని ఊహించని పాక్ క్రికెటర్లు.. ఎయిర్‌పోర్టులో అభిమానుల మద్దతుకు ఫిదా అయ్యారు. బస చేసిన పార్క్ హయత్ హోటల్లోనూ అపూర్వ స్వాగతం లభించడంతో పాక్ ఆటగాళ్లు ఉబ్బితబ్బిబ్బయ్యారు. పలువురు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలపడమే కాకుండా తమ స్వాగత వీడియోలను పోస్ట్ చేశారు.
హైదరాబాద్ అభిమానుల ప్రేమ, మద్దతుకు పొంగిపోయానని కెప్టెన్ బాబర్ ట్వీట్ చేస్తే, హైదరాబాద్, ఇండియా గ్రేట్ వెల్కం అని షాహీన్ ఆఫ్రీదీ పోస్ట్ చేశాడు. ఏడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన పాక్ జట్టుకు టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ హృదయపూర్వక స్వాగతం పలికాడు. అంతేకాదు తన ఇంట్లో దాయాది ఆటగాళ్లకు విందు ఇస్తానని కోహ్లీ తెలిపాడు. ‘వరల్డ్‌కప్ కోసం భారత్‌కు వచ్చిన పాక్ జట్టుకు హృదయపూర్వక స్వాగతం. నా స్నేహితులు ముఖ్యంగా షాదాబ్ ఖాన్‌కు మా ఇంట్లో మంచి విందు ఏర్పాటు చేస్తాను’ అని కోహ్లీ ట్వీట్ చేశాడు.
వరల్డ్‌కప్ కోసం భారత్ చేరుకున్న పాకిస్థాన్ జట్టు శుక్రవారం తొలి వామప్ మ్యాచ్ ఆడనుంది. బాబర్ సేన ఉప్పల్ స్టేడియంలో 2019 రన్నరప్ న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఆసియా కప్‌లో సూపర్-4లోనే ఇంటిదారి పట్టిన పాక్ ఈ మ్యాచ్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనుంది. మరోవైపు కివీస్ కూడా మెగాటోర్నీకి ముందు గెలుపుతో ఆత్మవిశ్వాసం రెట్టింపు చేసుకోవాలని భావిస్తోంది. ఇరుజట్ల ఆటగాళ్లు గురువారం మైదానంలో కాసేపు ప్రాక్టీస్ చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే.. భద్రతా కారణాలతో నిర్వాహకులు ప్రేక్షకులను ఈ మ్యాచ్‌కు అనుమతించడం లేదు. ఇదిలా ఉంటే పాక్ క్రికెటర్లకు హైదరాబాద్ పోలీసులు అదనపు భద్రత కల్పిస్తున్నారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తున్నారు.