దుబాయ్: మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు.. ఇప్పటికే వన్డే ప్రపంచకప్లో వరుస పరాజయాలతో సతమతమై పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచిన శ్రీలంకకు మరో షాక్ తగిలింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుక్రవారం శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది. లంక బోర్డు స్వయం ప్రతిపత్తితో వ్యవహరించలేకపోతోందని.. ప్రభుత్వ జోక్యం ఎక్కువైనందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ వెల్లడించింది.
సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. క్రికెట్ పాలకమండలిని తొలగించాలని గురువారం శ్రీలంక పార్లమెంట్లో అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు పట్టుబట్టడంతో ఐసీసీ ఈ చర్యకు పూనుకుంది. 2021లో ఇలాగే ప్రభుత్వ మితిమీరిన జోక్యం కారణంగా జింబాబ్వే క్రికెట్ బోర్డుపై సస్పెన్షన్ విధించగా.. తాజాగా ఆ వేటు ఎదుర్కొన్న రెండో శాశ్వత సభ్య దేశంగా లంక నిలిచింది.