Team India | బెంగళూరు: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో భారత మహిళల క్రికెట్ జట్టు సమిష్టి ప్రదర్శనతో శుభారంభం చేసింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మొదటి వన్డేలో భారత్.. దక్షిణాఫ్రికాపై 143 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. టీమ్ఇండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (127 బంతుల్లో 117, 12 ఫోర్లు, 1 సిక్సర్) కెరీర్లో ఆరో శతకంతో కదం తొక్కగా దీప్తి శర్మ (37, 2 వికెట్లు), పూజా వస్త్రకార్ (31, 1 వికెట్) ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టారు. అరంగేట్ర మ్యాచ్‌లోనే ఆశా శోభన (4/21)సత్తాచాటింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. అనంతరం సఫారీ మహిళల జట్టు.. 37.4 ఓవర్లలో 122 పరుగులకే చేతులెత్తేసింది. మంధానకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికపై ఈనెల 19న జరుగుతుంది.
కొద్దిరోజుల క్రితమే బెంగళూరులో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్లో రెచ్చిపోయిన స్మృతి.. తొలి వన్డేలోనూ ఆ ఫామ్‌ను కొనసాగించింది. సహచర బ్యాటర్లు షఫాలీ వర్మ (7), హేమలత (12), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (10), జెమీమా రోడ్రిగ్స్ (17), రిచా ఘోష్ (3) విఫలమైనా లోయరార్డర్ బ్యాటర్లు దీప్తి, పూజా అండతో భారత్‌కు పోరాడగలిగే స్కోరును అందించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన మంధాన..43వ ఓవర్లో శతకాన్ని పూర్తిచేసింది.
మోస్తరు ఛేదనలో సౌతాఫ్రికా ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. కెప్టెన్ లారా వోల్వార్డ్ (4)ను రేణుకా సింగ్ తొలి ఓవర్లోనే బౌల్డ్ చేసి భారత్‌కు బ్రేక్ అందించింది. బ్రిట్స్ (18), అన్నెకె (5) సారథినే అనుసరించారు. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను సునె లుస్ (33), మరిజన్నె కాప్ (24) ఆదుకునే యత్నం చేశారు. కానీ ఆశా శోభన రంగ ప్రవేశం చేశాక సఫారీల ఆటలు సాగలేదు. లోయరార్డర్ బ్యాటర్లు చేతులెత్తేయడంతో పర్యాటక జట్టుకు భారీ ఓటమి తప్పలేదు.
2 ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో అంతర్జాతీయ క్రికెట్లో స్మృతి 7 వేల (7,059) పరుగుల మార్కును దాటి ఈ ఘనత సాధించిన రెండో భారత ప్లేయర్‌గా రికార్డులకెక్కింది. మాజీ సారథి మిథాలీ రాజ్ (10,868) అగ్రస్థానంలో ఉంది.
భారత్: 50 ఓవర్లలో 265/8 (స్మృతి 117, దీప్తి 37, అయబొంగ 3/47, క్లాస్ 2/51).
దక్షిణాఫ్రికా: 37.4 ఓవర్లలో 122 ఆలౌట్ (సునె 33, కాప్ 24, శోభన 4/21, దీప్తి 2/10)