దోహా: అంతర్జాతీయ చెస్ వేదికపై భారత త్రివర్ణ పతాకం మరోమారు సగర్వంగా రెపరెపలాడింది. తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేసి అర్జున్ కొత్త చరిత్ర లిఖించాడు. ఇప్పటికే ప్రతిష్టాత్మక ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో మెరిసిన అర్జున్ తాజాగా బ్లిట్జ్‌లోనూ సత్తాచాటాడు. ప్రత్యర్థులకు దీటైన సవాల్ విసురుతూ ముందుకు సాగిన అర్జున్ మరో కాంస్య పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. మంగళవారం చివరి వరకు హోరాహోరీగా సాగిన మెగాటోర్నీలో అర్జున్ తనదైన రీతిలో ప్రత్యర్థులకు చెక్‌పెడుతూ ముందుకుసాగాడు.
ఈ క్రమంలో మెగాటోర్నీలో రెండు కాంస్య పతకాలు సాధించడం ద్వారా ఈ యువ గ్రాండ్‌మాస్టర్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. వరల్డ్ బ్లిట్జ్ టోర్నీలో పతకం గెలిచిన చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, వైశాలి తర్వాత మూడో భారత జీఎంగా అర్జున్ నిలిచాడు. దీనికి తోడు ఆనంద్ తర్వాత ర్యాపిడ్, బ్లిట్జ్ రెండింటిలో పతకాలు సాధించిన రెండో భారత ప్లేయర్‌గానూ ఈ వరంగల్ కుర్రాడు కొత్త ఘనత సొంతం చేసుకున్నాడు. ఒకే ఏడాదిలో రెండు టైటిళ్లు(ర్యాపిడ్, బ్లిట్జ్) సాధించిన రెండో జీఎంగాను అర్జున్ నిలిచాడు. మొత్తంగా సహచర భారత ప్లేయర్లు నిరాశపరిచిన చోట తన సత్తా ఏంటో చేతల్లో చూపెడుతూ అర్జున్ కాంస్య మోత మోగించాడు.
ఆది నుంచే అదే జోరు:
ప్రపంచ బ్లిట్జ్ చెస్ టోర్నీలో భారత యువ జీఎం అర్జున్ ఆది నుంచే తనదైన జోరు కనబరిచాడు. పోటీల తొలి రోజు సోమవారం 13 గేముల్లో 10 పాయింట్లతో అర్జున్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో ఎనిమిది సార్లు చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను కూడా చిత్తుచేసి ఔరా అనిపించాడు. రెండో రోజు జరిగిన ఆరు గేముల్లోనూ ఈ 22 ఏండ్ల యువ చెస్ ప్లేయర్ దూకుడు కొనసాగించాడు. మొత్తం 19 రౌండ్లు ముగిసే సరికి 15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు. కరునా ఫాబియానో(14, అమెరికా), మాగ్నస్ కార్ల్సన్(13.5, నార్వే), అబ్దుసత్రోవ్ నోదిర్బెక్(13, ఉజ్బెకిస్థాన్) సెమీస్‌లో నిలిచారు. వాస్తవానికి మాక్సిమ్ వాచైర్ లాగ్రెవ్(13)తో కలిసి పాయింట్ల పరంగా సమంగా నిలిచిన నోదిర్బెక్ బెస్ట్ టైబ్రేక్ పాయింట్లతో సెమీస్ పోరుకు అర్హత సాధించాడు.
లీగ్ దశలో ఎదురులేకుండా సాగిన అర్జున్‌కు సెమీస్‌లో నోదిర్బెక్ నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. మూడు సెమీఫైనల్ గేమ్స్‌లో అర్జున్ 0.5-2.5తో నోదిర్బెక్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలయ్యాడు. తొలి గేమ్‌లో తెల్లపావులతో బరిలోకి దిగిన అర్జున్ 47 ఎత్తుల్లోనే మ్యాచ్‌ను కోల్పోయాడు. ఇక్కణ్నుంచి జోరు పెంచిన నోదిర్బెక్ రెండో గేమ్ 75వ ఎత్తులో ఆర్సీ5 ఎత్తుతో 83 ఎత్తుల్లో గేమ్‌ను తన సొంతం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య మూడోగేమ్ డ్రా గా ముగిసింది. మరోవైపు నార్వే చెస్ స్టార్ మాగ్నస్ కార్ల్సన్ రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి వరల్డ్ బ్లిట్జ్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన ఫైనల్లో కార్ల్సన్ 2.5-1.5తో నోదిర్బెక్పై చిరస్మరణీయ విజయం సాధించాడు.