కోల్‌కతా: బంతి గింగిరాలు తిరుగుతూ బౌలర్లు ఆధిపత్యం చెలాయిస్తున్న ఈడెన్ గార్డెన్స్ టెస్టు ఆసక్తికరంగా సాగుతున్నది. బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికీ బంతితో స్పిన్నర్లు మాయ చేయడంతో ఈ మ్యాచ్‌లో భారత్ పట్టు బిగించింది. సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా (4/29), మణికట్టు మాంత్రికుడు కుల్దీప్ యాదవ్ (2/12) మాయ చేయడంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఏడు కీలక వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది.
కెప్టెన్ టెంబా బవుమా (29*) ఒంటరిపోరాటం చేస్తుండగా ఆ జట్టు ప్రస్తుతం 63 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో సఫారీ స్పిన్నర్ సైమన్ హర్మర్ (4/30), పేసర్ మార్కో యాన్సెన్ (3/35) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 189 రన్స్‌కు కుప్పకూలింది. కేఎల్ రాహుల్ (39), వాషింగ్టన్ సుందర్ (29) ఫర్వాలేదనిపించారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్ మూడో రోజైన శనివారం ముగియడం దాదాపుగా ఖాయం! అయితే ఈ పిచ్‌పై 130-150 పరుగుల లక్ష్యాన్ని చేధించడమూ కష్టమేనన్న విశ్లేషణల నేపథ్యంలో విజయం ఎవరి వైపు మళ్లుతుందోనన్న ఆసక్తి నెలకొంది.
తొలి రోజు స్పిన్నర్లకు అంతగా సహకరించని ఈడెన్ గార్డెన్స్ పిచ్.. రెండో రోజు మాత్రం గిర్రున తిరిగింది. మూడో రోజు నుంచి స్పిన్నర్లకు సహకరిస్తుందని అంచనాలు వేసినా.. రెండో రోజుకే స్పిన్నర్లు మ్యాచ్ ఫలితాన్ని శాసించే విధంగా రాణించారు. భారత ఇన్నింగ్స్‌లో హర్మర్ బంతులను ఎదుర్కునేందుకు బ్యాటర్లు తంటాలు పడటంతో స్టాండ్ ఇన్ కెప్టెన్ రిషభ్ పంత్.. రెండో ఓవర్ నుంచే స్పిన్నర్లకు బంతినిచ్చాడు. ఏడో ఓవర్లో బంతినందుకున్న కుల్దీప్.. నాలుగో బంతికి రికెల్టన్ (11)ను వికెట్ల ముందు బలిగొన్నాడు. 9వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన జడ్డూ.. నిరాటంకంగా 11 ఓవర్లు వేసి సఫారీ వెన్ను విరిచాడు.
పిచ్‌పై ఉన్న బౌన్స్‌ను సద్వినియోగం చేసుకుంటూ కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు విసిరుతూ ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 9వ ఓవర్లో జడ్డూ వేసిన రెండో బంతిని స్వీప్ చేయబోయిన మార్క్మ్ (4) షార్ట్ లెగ్ వద్ద జురెల్ చేతికి చిక్కాడు. 17వ ఓవర్లో అతడు.. మల్డర్ (11), టోని డీ జార్జి (2)ను బోల్తా కొట్టించాడు. డ్రింక్స్ విరామం తర్వాత అదిరిపోయే బంతితో స్టబ్స్ (5)ను బౌల్డ్ చేశాడు. 28వ ఓవర్లో అక్షర్.. వెరీన్ (9)ను పెవిలియన్‌కు పంపాడు. యాన్సెన్ (13) కూడా అతడినే అనుసరించడంతో సఫారీలు ఏడో వికెట్ కోల్పోయారు. బవుమాతో పాటు బాష్ (1*) క్రీజులో ఉన్నారు.
అంతకుముందు భారత ఇన్నింగ్స్ సైతం స్పిన్‌కు కుదేలైంది. ఓవర్‌నైట్ స్కోరు 37/1తో రెండో రోజు ఆరంభించిన భారత్ తొలి గంటలో బాగానే ఆడింది. రాహుల్, సుందర్ సాధికారికంగా బ్యాటింగ్ చేశారు. స్పిన్నర్ కేశవ్ మహారాజ్‌ను ఈ జోడీ సమర్థంగానే ఎదుర్కుంది. డ్రింక్స్ సమయానికి 75/1గా ఉన్న టీమ్ఇండియా.. ఆ తర్వాత తడబడింది. డ్రింక్స్ ముగిశాక బంతి అందుకున్న హర్మర్.. తన తొలి ఓవర్లోనే వాషింగ్టన్‌ను ఔట్ చేసి వికెట్ల ఖాతా తెరిచాడు. కెప్టెన్ గిల్ ఎదుర్కున్న మూడో బంతిని బౌండరీగా తరలించినా తర్వాత మెడ పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. అతడి స్థానంలో వచ్చిన పంత్ (24 బంతుల్లో 27, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా ఆడాడు.
సౌతాఫ్రికా స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగిన పంత్.. మహారాజ్ బౌలింగ్‌లో 4, 6 బాదాడు. కానీ మహారాజ్ 40వ ఓవర్లో రాహుల్.. స్లిప్స్‌లో మార్క్మ్ క్యాచ్ పట్టడంతో 30 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. మహారాజే వేసిన 42వ ఓవర్లో పంత్ 6,4తో రెచ్చిపోయినా బాష్ బౌలింగ్‌లో కీపర్ వెరీన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. లంచ్ తర్వాత హర్మర్.. జురెల్ (14), అక్షర్ (16)ను ఔట్ చేసి ఆతిథ్య జట్టును దెబ్బకొట్టాడు. ఈ ఇద్దరితో కలిసి విలువైన పరుగులు చేసిన జడేజా (27) భారత్‌ను ఆధిక్యంలోకి తీసుకొచ్చాడు. 171/5తో కాస్త మెరుగ్గానే కనిపించిన గిల్ సేనను.. హర్మర్, యాన్సెన్ భారత లోయరార్డర్‌ను దెబ్బకొట్టారు.
తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ మెడ నొప్పితో మైదానాన్ని వీడిన కెప్టెన్ గిల్ ఈ టెస్టులో పాల్గొనడం అనుమానంగానే మారింది. రెండో రోజు ఆట ముగిసిన తర్వాత అతడిని స్ట్రెచర్‌పై సమీపంలో ఉన్న ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం గిల్.. బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు.
2 టెస్టుల్లో భారత్ తరఫున 300 వికెట్లు, 4 వేల పరుగులు చేసిన రెండో ఆటగాడు జడేజా. అంతకుముందు ఈ జాబితాలో కపిల్ దేవ్ ఉన్నాడు. అంతర్జాతీయ స్థాయిలో ఈ ఘనత సాధించినవారిలో జడ్డూది నాలుగో స్థానం.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ : 159 ఆలౌట్
భారత్ : 62.2 ఓవర్లలో 189 ఆలౌట్
(రాహుల్ 39, సుందర్ 29, హార్మర్ 4/30, యాన్సెన్ 3/35) దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ : 35 ఓవర్లలో 93/7 (బవుమా 29*, యాన్సెన్ 13, జడేజా 4/29, కుల్దీప్ 2/12)