IND vs BAN: భారత్ – బంగ్లాదేశ్ మధ్య పూణే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఫీల్డింగ్ లో అదరగొట్టింది. టీమిండియా స్టార్ ఫీల్డర్ రవీంద్ర జడేజా, వికెట్ కీపర్ కెఎల్ రాహుల్ అద్భుత క్యాచ్‌లు పట్టి బంగ్లా బ్యాటర్లను నిలువరించారు. నేటి మ్యాచ్‌లో బౌండరీ లైన్ వద్ద కూడా గిల్ కూడా రెండు క్యాచ్‌లను అందుకున్నాడు. మ్యాచ్‌లో ముష్ఫీకర్ రహీమ్ ఇచ్చిన క్యాచ్‌ను ముందుకు డైవ్ చేస్తూ అద్భుతంగా అందుకున్న జడ్డూ.. క్యాచ్ అందుకున్న వెంటనే ‘మా ఫీల్డింగ్ కోచ్‌కు మెడల్ ఇవ్వండి..’ అన్నట్టుగా సైగ చేశాడు.
వివరాల్లోకెళ్తే.. బ్యాటింగ్‌లో కుదురుకుంటున్న ముష్ఫీకర్‌ను ఔట్ చేసేందుకు గాను బుమ్రా వేసిన 42వ ఓవర్లో మూడో బంతిని ఆఫ్ సైడ్ దిశగా సంధించాడు. ఆ బంతిని కట్ చేయబోయిన ముష్ఫీకర్ ఇచ్చిన క్యాచ్‌ను బ్యాక్వర్డ్ పాయింట్ వద్ద ఉన్న జడ్డూ ముందుకు డైవ్ చేస్తూ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. క్యాచ్ పట్టిన తర్వాత జడ్డూ మెడల్ ఇవ్వండి అంటూ ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ ను చూస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. జడేజా తర్వాత ఫీల్డ్ అంపైర్ ఎరాస్మస్ కూడా దిలీప్‌ను ఉద్దేశిస్తూ అతడికి మెడల్ ఇస్తున్నట్టుగా సంజ్ఞ చేశాడు. కాగా బంగ్లా ఇన్నింగ్స్ ముగిశాక జడ్డూ మాట్లాడుతూ.. ‘ఆ సెలబ్రేషన్ మా ఫీల్డింగ్ కోచ్ కోసం. మాకు ఈ ఫీల్డింగ్ ప్రదర్శనకు మెడల్ దక్కాలి. అదే విషయాన్ని నేను ఆయనకు చెప్పేందుకు యత్నించా..’అని అన్నాడు.
Jadeja- The Fielder is beast🔥#indiavsbangladesh #CWC23 pic.twitter.com/uvlErrBeqG
— Zee (@mjzee921) October 19, 2023
జడేజాతో పాటు ఈ మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ కూడా ఫ్లైయింగ్ క్యాచ్ అందుకున్నాడు. సిరాజ్ వేసిన 24వ ఓవర్లో తొలి బంతికి మెహిది హసన్ ఇచ్చిన క్యాచ్‌ను ఒడిసిపట్టాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత జట్టు కూడా ధీటుగా బదులిస్తోంది.