లీగ్ చివరి దశకు వస్తున్నా కొద్ది సమీకరణాలు మారిపోతున్నాయి. ఐపీఎల్ 14వ సీజన్లో ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ బెర్త్‌లు దక్కించుకోగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎప్పుడో పోటీ నుంచి తప్పుకుంది. ఇక మిగిలిన ఒక్క ప్లేస్ కోసం నాలుగు జట్ల మధ్య రసవత్తర పోటీ సాగుతున్నది. ఇందులో కోల్‌కతా నైట్‌రైడర్స్ వైపు కాస్త మొగ్గు ఉండగా.. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ చెరో 12 మ్యాచ్‌లు ఆడి 10 పాయింట్లతో ఉన్నాయి. సాంకేతికంగా పంజాబ్ ఇంకా పోటీలో ఉన్నా.. అది ముందడుగు వేయాలంటే అద్భుతం జరగాల్సిందే. ఈ నేపథ్యంలో నాలుగు జట్లకు ఉన్న అవకాశాలను ఓసారి పరిశీలిస్తే..
కోల్‌కతా నైట్‌రైడర్స్
లీగ్‌లో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లాడిన కోల్‌కతా ఆరింట నెగ్గి 12 పాయింట్లతో ప్రస్తుతం పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. చివరి పోరులో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనున్న కోల్‌కతా ఆ మ్యాచ్‌లో నెగ్గితే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ముందడుగు వేస్తుంది. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న మిగిలిన జట్లతో పోలిస్తే రన్‌రేట్ మెరుగ్గా ఉండటం కోల్‌కతాకు కలిసొచ్చే అంశం.
ఆడిన మ్యాచ్‌లు-13
పాయింట్లు-12
మిగిలిన మ్యాచ్‌లు-1
రాజస్థాన్ రాయల్స్
12 మ్యాచ్‌లాడి ఐదు విజయాలు సాధించిన రాజస్థాన్ ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్ (ముంబై, కోల్‌కతా)లు నెగ్గితే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది.
ఆడినవి -12
పాయింట్లు-10
మిగిలిన మ్యాచ్‌లు-2
పంజాబ్ కింగ్స్
పై మూడు జట్లతో పోలిస్తే పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు చేరడం కాస్త కష్టమే. ఇప్పటికే 13 మ్యాచ్‌లాడిన పంజాబ్ 10 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మిగిలిన ఏకైక మ్యాచ్‌లో చెన్నైతో తలపడాల్సి ఉంది. ఈ మ్యచ్‌లో నెగ్గడంతో పాటు.. ఇతర సమీకరణాలు అనుకూలిస్తేనే పంజాబ్ ముందంజ వేస్తుంది.
ఆడినవి-13 పాయింట్లు-10
మిగిలిన మ్యాచ్‌లు-1
ముంబై ఇండియన్స్
ఈ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లాడి 5 విజయాలతో పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో రాజస్థాన్, హైదరాబాద్‌తో ఢీకొననున్న రోహిత్ సేన.. ఈ రెండు మ్యాచ్‌ల్లో నెగ్గడంతో పాటు రన్‌రేట్‌ను మెరుగుపర్చుకుంటేనే ముందడుగు వేయనుంది. ఒక వేళ ముంబై ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిచి.. రాజస్థాన్‌తో పోరులో కోల్‌కతా ఓడితే.. రన్‌రేట్‌తో పనిలేకుండా రోహిత్ సేన ప్లే ఆఫ్స్ చేరుతుంది.
ఆడినవి-12
పాయింట్లు-10
మిగిలిన మ్యాచ్‌లు-2