Test captaincy : భారత స్టార్ బ్యాటర్ (Indian star batter), హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఇంగ్లండ్ (England) పర్యటనకు ముందు తన టెస్ట్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో తదుపరి కెప్టెన్ ఎంపిక కోసం బీసీసీఐ (BCCI), సెలక్షన్ కమిటీ తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో కెప్టెన్ రేసులో ముందు వరుసలో ఉన్న శుభ్‌మాన్ గిల్ (Shubman Gill).. హెడ్ కోచ్ (Head coach) గౌతమ్ గంభీర్ (Gautham Gambhir) తో ఏకంగా ఐదు గంటలపాటు భేటీ అయినట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా మే 6న వాంఖడే స్టేడియంలో గిల్‌తో మాట్లాడాడు. నూతన టెస్ట్ కెప్టెన్ ఎంపిక కోసం కసరత్తు జరుగుతున్న వేళ ఈ కీలక భేటీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రోహిత్ శర్మ మే 7న తన టెస్ట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. అప్పటి నుంచి తదుపరి కెప్టెన్ రేసులో శుభ్‌మాన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జూన్ 20న మొదలయ్యే ఇంగ్లండ్ టూర్‌తో భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్ ప్రయాణం ప్రారంభం కానుంది. కానీ ఇప్పటివరకైతే అధికారికంగా ఇంకా ఎవరి పేరును ఖరారు చేయలేదు.
ఇలాంటి సమయంలో శుభ్‌మాన్ గిల్ టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్‌ను ఢిల్లీలోని అతడి నివాసంలో కలిసినట్లు సమాచారం. ఏకంగా ఐదు గంటలపాటు వీరి భేటీ జరిగినట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ ప్రకటించడానికి ఒకరోజు ముందు అంటే మే 6న కూడా ఐపీఎల్ మ్యాచ్ అనంతరం బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వాంఖడే స్టేడియంలో గిల్‌తో ముచ్చటించాడు. ఈ రెండు భేటీలు క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అయితే ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం బీసీసీఐ శుభ్‌మాన్ గిల్‌ను టీమిండియా భవిష్యత్తు కెప్టెన్‌గా చూస్తోంది.
ఈ ఐపీఎల్లో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్‌ను ఒక కెప్టెన్‌గా శుభ్‌మాన్ గిల్ అద్భుతంగా నడిపిస్తున్నాడు. ఒక బ్యాటర్‌గానూ రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధికారులు గిల్ మీద సానుకూల దృక్పథంతో ఉన్నట్లు సమాచారం. ఇదిలావుంటే కొందరు టీమిండియా మాజీ దిగ్గజాలు మాత్రం బుమ్రా వైపు మొగ్గు చూపుతున్నారు. రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా సీనియర్ ప్లేయర్ అయిన రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తంచేశాడు.
ఏది ఏమైనప్పటికీ టీమిండియా టెస్టు జట్టు కొత్త కెప్టెన్ ఎవరనే విషయంలో ఉత్కంఠ ఇంకొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. అధికారికంగా బీసీసీఐ ఈ విషయాన్ని ఎప్పుడు ప్రకటిస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.