AITA | ఢిల్లీ: భారత టెన్నిస్ సమాఖ్య (ఐటా) అధ్యక్షుడు అనిల్ జైన్పై 8 రాష్ర్టాల టెన్నిస్ అసోసియేషన్స్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. ఈ మేరకు శనివారం (సెప్టెంబర్ 28) ఎక్స్ట్రా ఆర్డినరీ జనరల్ మీటింగ్ (ఈజీఎం)ను నిర్వహించేందుకు ఈ రాష్ర్టాల టెన్నిస్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. అసోం, జమ్మూ కాశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, త్రిపుర రాష్ర్టాల ప్రతినిధులు అనిల్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు.
వాస్తవానికి శనివారం ఐటా కూడా వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) జరిపించాల్సి ఉండగా అనిల్ వ్యతిరేక వర్గం కూడా ఇదే రోజు ఈజీఎంకు పిలుపునివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐటా నిధులను అనిల్ పక్కదారి మళ్లిస్తున్నారని, ఆయన తన కుటుంబంతో కలిసి విహారయాత్రలకూ ఈ నిధులనే వినియోగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి.