Rishitha Reddy | హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ టెన్నిస్ ప్లేయర్ బసిరెడ్డి రిశితారెడ్డి అంతర్జాతీయ వేదికపై మళ్లీ మెరిసింది. సింగపూర్‌లో జరిగిన రాడ్‌లేవర్ కప్ జూనియర్ ఆసియా/ఓషియానా రిజీనల్ క్వాలిఫయింగ్ రౌండ్లో భారత్ తరఫున రిశిత పోటీకి దిగింది. ఈ టోర్నీలో భారత్, సింగపూర్, జపాన్ టీమ్‌లు బరిలో నిలిచాయి.
గురువారం జరిగిన బాలికల సింగిల్స్ పోరులో రిశిత 6-1, 6-3తో మియు తకిగుచి(జపాన్)తో గెలువగా, అదే జోరులో సింగపూర్‌కు చెందిన జాయ్ షానియాపై 6-1, 6-2తో చిత్తు చేసింది టైటిల్ విజేతగా నిలిచింది. ఇదిలా ఉంటే అంతర్జాతీయ లాన్ టెన్నిస్(ఐసీ)..భారత్ నుంచి ఇద్దరు బాలురు, బాలికలను ఎంపిక చేయగా, ఇందులో రిశిత చోటు దక్కించుకుంది. వచ్చే ఏడాది స్పెయిన్‌లో జరిగే అంతర్జాతీయ టోర్నీలో ఈ యువ ప్లేయర్ పోటీపడనుంది.