హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఏకాగ్ర చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆల్ఇండియా రేటింగ్ చెస్ టోర్నీలో తెంలగాణ ప్లేయర్ సుశాంత్ రన్నరప్‌గా నిలిచాడు. జాతీయ, రాష్ట్ర చెస్ సంఘాల సహకారంతో యూసుఫ్‌గూడ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ టోర్నీలో దేశం నలుమూలల నుంచి సుమారు 800 మంది ప్లేయర్లు పాల్గొన్నారు. విజేతగా నిలిచిన అక్షిత్ నేగి (న్యూఢిల్లీ)కి లక్ష రూపాయల నగదు బహుమతి లభించగా.. రన్నరప్ సుశాంత్‌కు రూ. 70 వేలు దక్కాయి. మంగళవారం జరిగిన టోర్నీ ముగింపు వేడుకల్లో వరుణ్ అగర్వాల్, కేఎస్ ప్రసాద్, సందీప్ నాయుడు, శ్రీధర్ విజేతలకు బహమతులు ప్రదానం చేశారు.