హైదరాబాద్, ఆట ప్రతినిధి: మలేషియా వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక లంకావీ యూత్ ఇంటర్నేషనల్ రెగెట్టా చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ సెయిలర్లు సత్తాచాటారు. అంతర్జాతీయ స్థాయి సెయిలర్లతో దీటుగా పోటీపడుతూ,ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమిస్తూ మన సెయిలర్లు స్వర్ణం సహా రెండు రజత పతకాలతో మెరిశారు. 420 మిక్స్డ్ డబుల్స్ అండర్-19 విభాగంలో తెలంగాణకు చెందిన తనూజ కామేశ్వర్, శ్రవణ్ కత్రావత్ జోడీ పసిడి పతకాన్ని అందుకుంది. ఈ ద్వయం ఆరు రేసుల్లో మూడు సార్లు అగ్రస్థానంలో నిలిచి పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
ఇదే విభాగంలో రాష్ట్ర యువ ద్వయం దీక్షిత కొమరవెల్లి, గణేశ్ పీర్కట్ల రజతం సొంతం చేసుకుంది. దీంతో ఒకే విభాగంలో రాష్ర్టానికి స్వర్ణం, రజతం దక్కింది. మరోవైపు అండర్-15 అప్టిమిస్టిక్ విభాగంలో లాహిరి కొమరవెల్లి అద్భుత ప్రదర్శనతో రజతం సొంతం చేసుకుంది. సిగ్నల్‌ను సరిగ్గా అర్థం చేసుకోవడంలో విఫలమైన లాహిరి తృటిలో స్వర్ణం చేజార్చుకుంది. మొత్త 81 మంది అంతర్జాతీయ సెయిలర్లు పోటీపడ్డ టోర్నీలో భారత సెయిలర్లు నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచారు. ఈ టోర్నీలో భారత్ 9 పతకాలు ఖాతాలో వేసుకుంది. జూనియర్ అంతర్జాతీయ టోర్నీలో ఇన్ని పతకాలు గెలువడం ఇదే తొలిసారి కావడం విశేషం. హాంకాంగ్, చైనా, థాయ్‌లాండ్ లాంటి బలమైన దేశాలను వెనుకకు నెడుతూ మన సెయిలర్లు ఈ ఘనత సాధించారు. హుసేన్‌సాగర్‌లో చేసిన కఠోర సాధనే ఈ విజయానికి కారణమని స్వర్ణ విజేత తనూజ పేర్కొంది.