డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతున్న 38వ నేషనల్ గేమ్స్‌లో తెలంగాణ పతకాల పరంపర కొనసాగుతున్నది. గురువారం వేర్వేరు క్రీడా విభాగాల్లో తెలంగాణకు రెండు కాంస్య పతకాలు దక్కాయి. తొలుత జరిగిన షాట్‌గన్ మిక్స్డ్ టీమ్‌ఈవెంట్‌లో రాష్ర్టానికి చెందిన బత్తుల మునిక్, రష్మి రాథోడ్ ద్వయం కాంస్య పతకం సొంతం చేసుకుంది.
చివరి రౌండ్ వరకు హోరాహోరీగా సాగిన పోరులో మునిక్, రష్మి జోడీ 133 పాయింట్లతో నిలిచింది. హర్యానా, పంజాబ్ షూటర్లు వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. మరోవైపు నెట్‌బాల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రాష్ట్ర జట్టు కాంస్యం ఖాతాలో వేసుకుంది. తెలంగాణ, చత్తీస్‌గఢ్ మధ్య చివరి నిమిషం వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన పోరు 31-31తో సమమైంది. దీంతో ఇరు జట్లను విజేతలుగా ప్రకటించారు. శుక్రవారం చివరి రోజైన నేషనల్ గేమ్స్‌లో తెలంగాణ 3 స్వర్ణాలు, 3 రజతాలు, 12 కాంస్యాలతో 26వ స్థానంలో కొనసాగుతున్నది.