హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ దుమ్మురేపుతున్నది. ఈ క్రీడల్లో ఇప్పటికే ఒక స్వర్ణం ఖాతాలో వేసుకున్న ఈ యువ స్విమ్మర్ ఆదివారం 1500 మీటర్ల ఫ్రీైస్టెల్లో పసిడి పతకం కైవసం చేసుకొని డబుల్ ధమాకా మోగించింది. పంచకుల వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో వ్రితి 18 నిమిషాల 1.45 సెకన్లలో లక్ష్యాన్ని చేరింది. ఈ క్రమంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రికార్డు (18 నిమిషాల 31 సెకన్లు)ను బద్దలు కొట్టింది. పోటీలను వీక్షించేందుకు వెళ్లిన రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి.. వ్రిత్తిని ప్రత్యేకంగా అభినందించారు. రికార్డు సమయంలో గమ్యాన్ని చేరి రెండో స్వర్ణం సాధించడం రాష్ర్టానికే గర్వకారణమని అన్నారు. ఆయనతో పాటు తెలంగాణ స్విమ్మింగ్ సంఘం కార్యదర్శి రామకృష్ణ, ఉమేశ్, జాన్ సిద్దిఖీ ఉన్నారు.