జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో తెలంగాణ ప్లేయర్ నిత్య గంధె అదరగొడుతున్నది. టోర్నీ ఏదైనా పతకం పక్కా అన్న రీతిలో దూసుకెళుతున్నది. రేసు రేసుకు తన పరుగుకు మరిన్ని హంగులు అద్దుకుంటూ పతకాలు కొల్లగొడుతున్నది. ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగుతున్న నిత్య వచ్చే ఏడాది చైనా వేదికగా జరిగే ప్రతిష్టాత్మక ఆసియాగేమ్స్ లక్ష్యంగా ఎంచుకున్నది. ఎలాగైనా ఆసియా క్రీడల్లో భారత్ తరఫున బరిలోకి దిగాలన్న పట్టుదలతో ఉన్న నిత్య ఆ దిశగా అడుగులు వేస్తున్నది. ఈ నెలాఖరులో కొరియాలో జరిగే ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ కోసం కేరళలో శిక్షణ పొందుతున్న
ఈ హైదరాబాద్ అమ్మాయి.. నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలు పంచుకుంది.
Nithya Gandhe | నమస్తే తెలంగాణ క్రీడా విభాగం : ఏషియన్ అథ్లెటిక్స్ టోర్నీకి సన్నద్ధత? దక్షిణకొరియా వేదికగా ఈనెల 27 నుంచి మొదలయ్యే ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ కోసం ప్రస్తుతం కేరళలోని భారత క్రీడా ప్రాధికార సంస్థ(సాయ్)లో శిక్షణ తీసుకుంటున్నాను. కోచ్ శ్రీనివాసన్ సర్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ కొనసాగుతున్నది. సీనియర్ స్థాయిలో నాకు ఇది తొలి అంతర్జాతీయ టోర్నీ. అందువల్ల ఎలాగైనా రాణించాలన్న పట్టుదలతో క్యాంప్‌లో చెమటోడుస్తున్నాను. గతానికి భిన్నంగా కేవలం ఫిజికల్ ఫిట్‌నెస్‌పైనే దృష్టి కాకుండా మానసికంగా బలంగా ఉండేందుకు కసరత్తులు చేస్తున్నాను. ఇంతకుముందులా కాకుండా లక్ష్యం చేరుకునేందుకు మనసును ప్రశాంతంగా ఉంచేలా యోగా సాధన చేయడం కలిసొస్తున్నది.
జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. గతేడాది నుంచి కెరీర్‌ను మెరుగైన రీతిలో మలుచుకునేందుకు దృష్టి కేంద్రీకరించాను. ముఖ్యంగా టోర్నీకి టోర్నీకి ప్రదర్శనను మెరుగు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాను. ఈ క్రమంలో ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుంటూ పతకాలు సాధిస్తున్నాను. గతంలో చేసిన తప్పులు మళ్లీ పునరావృతం కాకుండా కోచ్ సలహాలు, సూచనలు పాటిస్తున్నాను. ఈ మధ్య బెంగళూరు, కొచ్చిలో జరిగిన జాతీయ అథ్లెటిక్స్ టోర్నీల్లో పతకాలు సాధించడం నాకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.
కొరియాలో జరిగే ఏషియన్ అథ్లెటిక్స్‌లో చైనా, సింగపూర్, కొరియా అథ్లెట్ల నుంచి తీవ్ర పోటీ ఎదురయ్యే అవకాశముంది. ఫిట్నెస్, టైమింగ్ పరంగా వారు మన కంటే ఒకింత ముందంజలో ఉంటారు. కానీ గట్టి పోటీనిచ్చేందుకు భారత అథ్లెట్లు సిద్ధంగా ఉన్నారు. నా టైమింగ్ విషయంలో చాలా వరకు మెరుగయ్యాను. 100మీటర్ల రేసులో ప్రస్తుతం నా వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్ 11.41సెకన్లు కాగా, 200మీటర్ల రేసులో 23.36 సెకన్లుగా ఉంది. జాతీయ రికార్డు (11.17సె, 22.89సె)ను అధిగమించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాను. వ్యక్తిగత స్ప్రింట్‌లో ప్రదర్శన ఆధారంగా టోర్నీలో 4X400 రిలే రేసులో భారత్ తరఫున పోటీ పడుతున్నాను.
మా స్వస్థలం శంషాబాద్. నాన్న వ్యాపారం చేస్తారు. అథ్లెటిక్స్‌లో రాణించేందుకు మా కుటుంబం ఇస్తున్న ప్రోత్సాహం మరువలేనిది. దీనికి తోడు నా చిన్నతనంలో ప్రోత్సహించిన పీఈటీ భద్రసార్ కృషి వెలకట్టలేనిది.
జాతీయ స్థాయిలో నిలకడగా పతకాలు సాధిస్తున్నా..రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన గుర్తింపు రావడం లేదు. ఇటీవల ఉత్తరాఖండ్ వేదికగా జరిగిన జాతీయ క్రీడల్లో తెలంగాణ తరఫున బరిలోకి దిగి మూడు పతకాలు సాధించాను. దీనికి తోడు బెంగళూరు, కొచ్చిలోజరిగిన ఫెడరేషన్ అథ్లెటిక్స్ టోర్నీల్లోనూ పతకాలు కొల్లగొట్టాను. కానీ ఇప్పటి వరకు సాట్స్ నుంచి ఆర్థిక ప్రోత్సాహం లభించలేదు.