Asia cup 2023 : భారత్, నేపాల్ మ్యాచ్‌లో పూర్తి ఓవర్లు సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. రెండోసారి వర్షం అంతరాయం కలిగించడంతో విజేతను నిర్ణయించేందుకు ఓవర్లను కుదించే అవకాశం ఉంది. దాంతో, డక్‌వర్త్ లూయిస్(Duckworth-Lewis) పద్ధతి ప్రకారం అంపైర్లు ఓవర్లను కుదించనున్నారు. ఒకవేళ అదే జరిగితే భారత జట్టు లక్ష్యం ఎంత ఉండనుందంటే.. 45 ఓవర్లు ఆడిస్తే 220 కొట్టాల్సి ఉంటుంది. కేవలం 40 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైతే ఇండియా 207 పరుగులు చేయాలి. 35 ఓవర్లకు కుదిస్తే 192, 30 ఓవర్లు అయితే 174 రన్స్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 20 ఓవర్లు మాత్రమే ఆడిస్తే 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది.
లక్ష్యం చిన్నదే అయినప్పటికీ రన్‌రేట్ దృష్టిలో పెట్టుకొని ఓపెనర్లు రోహిత్ శర్మ(4), శుభ్‌మన్ గిల్(12) ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. రెండో ఓవర్ నుంచి నేపాల్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. కానీ, రెండు ఓవర్లకే వర్షం మళ్లీ మొదలైంది. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్‌లోనూ వర్షం కారణంగా గంట వృథా అయింది. ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే.. ఇరుజట్లకు చెరొక పాయింట్ కేటాయిస్తారు.
మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ 230 పరుగులు చేసింది. యువ ఓపెనర్ అసిఫ్ షేక్ (58) అర్ధ శతకంలో జట్టు భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. చివర్లో సొంపల్ కమీ(48) ధనాధన్ ఇన్నింగ్స్‌తో జట్టు స్కోర్ 200 దాటించాడు. అయితే.. 48వ ఓవర్లో షమీ కమీని ఔట్ చేశాడు. అదే ఓవర్లో సందీప్ లమిచానే(9) రనౌటయ్యాడు. చివరి వికెట్‌గా వచ్చిన లలిల్ రాజ్‌బన్షీ(0)ని సిరాజ్ బౌల్డ్ చేయడంతో నేపాల్ 230 రన్స్‌కు పరిమితమైంది. భారత బౌలర్లలో జడేజా, సిరాజ్ మూడేసి వికెట్లు పడగొట్టారు.