Rohit Sharma | కాన్బెర్రా: భారత్, ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు క్రికెట్ పట్ల అమితమైన ప్రేమ ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్‌శర్మ పేర్కొన్నాడు. ప్రైమ్ మినిస్టర్ లెవన్‌తో మ్యాచ్ కోసం కాన్‌బెర్రాకు చేరుకున్న భారత క్రికెట్ జట్టు గురువారం ఆస్ట్రేలియా ప్రధానమంత్రి అంథోనీ అల్బనీస్ ఇచ్చిన ప్రత్యేక విందుకు హాజరైంది. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్‌శర్మ..టీమ్ఇండియా క్రికెటర్లను ఒక్కొక్కరిగా ప్రధానికి పరిచయం చేశాడు.
ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులో అద్భుతంగా రాణించిన విరాట్‌కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాను అల్బనీస్ అభినందించారు. పార్లమెంట్‌ను ఉద్దేశించి కెప్టెన్ రోహిత్ మాట్లాడుతూ ‘భారత్, ఆస్ట్రేలియా మధ్య ఎన్నో ఏండ్లుగా ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతున్నాయి. క్రికెట్ అంటే ఇరు దేశాల వాసులకు ఎంతో అభిమానం. ఆసీస్‌లో సవాళ్లకు ఎదురొడ్డుతూ రాణించడం భారత ప్లేయర్లు ఇష్టపడుతారు. రెండు దేశాల అభిమానుల అలరించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం’ అని అన్నాడు.