పారిస్: ఎర్రమట్టికోర్టు మహారాణి ఇగా స్వియాటెక్ (పోలండ్) ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. గురువారం ఫిలిప్పి చాట్రియర్ వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్స్‌లో టాప్ సీడ్ స్వియాటెక్ 6-2, 6-4తో కోకో గాఫ్ (అమెరికా)ను వరుస సెట్లలో ఓడించి ఫ్రెంచ్ ఓపెన్‌లో నాలుగోసారి ఫైనల్స్‌కు అర్హత సాధించింది. గత ఐదేండ్లలో స్వియాటెక్‌కు ఇది నాలుగో ఫైనల్ కావడం గమనార్హం. రెండో సెమీస్‌లో ఇటలీ యువ సంచలనం జాస్మిన్ పలోని 6-3, 6-1తో అన్‌సీడెడ్ రష్యా అమ్మాయి మిర్రా ఆండ్రివాను చిత్తుచేసి స్వియాటెక్‌తో అమీతుమీకి సిద్ధమైంది. ఈ ఇద్దరి మధ్య శనివారం ఫైనల్ పోరు జరుగనుంది. ఇక పురుషుల డబుల్స్ సెమీస్‌లో భారత ఆటగాడు రోహన్ బోపన్న-మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ 5-7, 6-2, 2-6తో సిమోన్ బొలెల్లి-వవస్సూరి (ఇటలీ) చేతిలో ఓడి నిష్క్రమించింది.