IPL | లక్నో: ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు నుంచి లక్నో సూపర్ జెయింట్స్ అధికారికంగా నిష్క్రమించింది. సోమవారం మ్యాచ్‌లో లక్నో 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) చేతిలో ఓటమిపాలైంది. తొలుత లక్నో.. ప్రత్యర్థి హైదరాబాద్ ఎదుట 206 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు మార్ష్ (39 బంతుల్లో 65, 6 ఫోర్లు, 4 సిక్సర్లు), మార్క్మ్ (38 బంతుల్లో 61, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరవిహారానికి తోడు నికోపూరన్ (26 బంతుల్లో 45, 6 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులతో 20 ఓవర్లలో లక్నో 205/7 స్కోరు చేసింది. ఆరంభంలో తేలిపోయిన సన్‌రైజర్స్ బౌలర్లు.. లక్నో ఓపెనర్ల నిష్క్రమణతో ఆఖర్లో ఫర్వాలేదనిపించారు. భారీ ఛేదనలో హైదరాబాద్ 18.2 ఓవర్లలో 206/4 స్కోరు చేసింది. అభిషేక్ శర్మ (20 బంతుల్లో 59, 4 ఫోర్లు, 6 సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో హైదరాబాద్ విజయంలో కీలకమయ్యాడు.
ఈ సీజన్లో భీకరమైన ఫామ్‌లో ఉన్న లక్నో ఓపెనింగ్ జోడీ మార్ష్, మార్క్మ్ ఆరంభం నుంచే హైదరాబాద్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. కమిన్స్ తొలి ఓవర్లోనే బౌండరీతో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన మార్ష్.. సిక్సర్లు, బౌండరీలతో చెలరేగి ఆడాడు. ఈ ద్వయం ఓవర్‌కు సిక్స్, బౌండరీకి తగ్గకుండా బాదడంతో పవర్ ప్లేలోనే ఆ జట్టు 69/0గా నిలిచింది. దూబే 8వ ఓవర్లో బౌండరీతో పాటు ఆఖరి బంతికి సింగిల్ తీసిన మార్ష్.. 28 బంతుల్లో అర్ధ శతకాన్ని పూర్తిచేశాడు. దూకుడుగా ఆడే క్రమంలో అతడు.. దూబే 11వ ఓవర్లో మలింగకు క్యాచ్ ఇవ్వడంతో 115 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. నితీశ్ రెడ్డి ఓవర్లో సింగిల్ తీసి యాభై పరుగుల మైలురాయిని దాటిన మార్క్మ్‌న్రు హర్షల్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. బదోని (3), సమద్ (3) విఫలమైనా ఆఖర్లో పూరన్ మెరుపులతో లక్నో భారీ స్కోరు చేసింది.
ఛేదనలో సన్‌రైజర్స్ 17 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయినా అభిషేక్.. ఇషాన్ కిషన్ అండగా చెలరేగి ఆడాడు. ఆకాశ్ దీప్ ఓవర్లో 4, 6తో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన అతడు.. అవేశ్ ఓవర్లో రెండు బౌండరీలు బాదిన అభిషేక్.. బిష్ణోయ్ 7వ ఓవర్లో నాలుగు భారీ సిక్సర్లతో 18 బంతుల్లోనే ఈ సీజన్లో మరో హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే దూకుడుగా ఆడే క్రమంలో దిగ్వేశ్ బౌలింగ్‌లో అభిషేక్ ఔటైనా..క్లాసెన్(47), కమిందు మెండిస్(32 రిటైర్డ్ హర్ట్) గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు.
లక్నో: 20 ఓవర్లలో 205/7 (మార్ష్ 65, మార్క్మ్ 61, మలింగ 2/28, నితీశ్ 1/28), హైదరాబాద్: 18.2 ఓవర్లలో 206/4(అభిషేక్ 59, క్లాసెన్ 47, దిగ్వేశ్ 2/37, రూర్కీ 1/31)