ఆహా! ఏమా కొట్టుడు.. స్టేడియం హోరెత్తిపోయేలా.. బౌలర్లు బెంబేలెత్తిపోయేలా.. అభిమానుల కరువు తీరిపోయేలా.. సన్‌రైజర్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన ఇంగ్లండ్ యంగ్ గన్ హ్యారీ బ్రూక్ అజేయ శతకంతో విజృంభించగా.. సారథి మార్క్మ్ తన విలువ చాటుకున్నాడు. మిడిలార్డర్ కూడా రాణించడంతో కొండంత స్కోరు చేసిన హైదరాబాద్.. ఆనక బౌలింగ్‌లోనూ రాణించి కోల్‌కతాను కట్టడి చేసింది. భారీ ఛేదనలో నితీశ్ రాణా, రింకూ సింగ్ పోరాడినా.. గత మ్యాచ్ మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయారు.
కోల్‌కతా: సన్‌రైజర్స్ హైదరాబాద్ జూలు విదిల్చింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో పరాజయాల అనంతరం పంజాబ్‌పై గెలిచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్లో బోణీ కొట్టిన హైదరాబాద్.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో విశ్వరూపం కనబర్చింది. బ్యాటర్లు దంచికొట్టడంతో భారీ స్కోరు చేసిన సన్‌రైజర్స్.. బౌలింగ్‌లోనూ రాణించి లీగ్‌లో రెండో విజయం ఖాతాలో వేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో హైదరాబాద్ 23 పరుగుల తేడాతో కోల్‌కతాను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.
ఇంగ్లండ్ యువ సంచలనం హ్యారీ బ్రూక్ (55 బంతుల్లో 100 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ శతకంతో కదంతొక్కగా.. కెప్టెన్ మార్క్మ్ (26 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), అభిషేక్ శర్మ (17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (6 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్సర్) దంచికొట్టారు. కోల్‌కతా బౌలర్లలో రస్సెల్ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులు చేసింది. కెప్టెన్ నితీశ్ రాణా (41 బంతుల్లో 75; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), గత మ్యాచ్ ‘సిక్సర్ల వీరుడు’ రింకూ సింగ్ (31 బంతుల్లో 58 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. హైదరాబాద్ బౌలర్లలో మయాంక్ మార్కండే, మార్కో జాన్సెన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. బ్రూక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా శనివారం డబుల్ హెడర్‌లో బెంగళూరుతో ఢిల్లీ, లక్నో సూపర్ జెయింట్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి.
లీగ్‌లో ఇప్పటి వరకు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన సన్‌రైజర్స్.. కోల్‌కతాపై పోరులో అదరగొట్టింది. వేలంలో రూ. 13.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసుకున్న ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ విధ్వంసం సృష్టించగా.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు మంచి ఆరంభం లభించింది. ఉమేశ్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో మూడు ఫోర్లతో తన ఉద్దేశాన్ని చాటిన బ్రూక్.. ఉమేశ్ తదుపరి ఓవర్లో రెండు సిక్సర్లు దంచాడు. ఒక ఎండ్‌లో బ్రూక్ ధాటిగా ఆడుతుంటే మరో ఎండ్‌లో మయాంక్ (9), త్రిపాఠి (9) నిరాశ పర్చారు. రస్సెల్ వేసిన ఐదో ఓవర్లో వీరిద్దరూ వెనుదిరిగారు. దీంతో పవర్ ప్లే (6 ఓవర్లు) ముగిసేసరికి హైదరాబాద్ 65/2తో నిలిచింది. మిడిల్ ఓవర్స్‌లో కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో పరుగుల రాబట్టడానికి ఇబ్బంది పడ్డ రైజర్స్ బ్యాటర్లు.. క్రీజులో కుదురుకున్నాక ఆకాశమే హద్దుగా చెలరేగారు. సుయాశ్ శర్మ వేసిన 12వ ఓవర్లో మార్క్మ్ 6,6,4 దంచగా.. బ్రూక్ 32 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మరో 4,6 కొట్టి 25 బంతుల్లో ఫిఫ్టీ కొట్టిన మార్క్మ్ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో వెనుదిరగగా.. అక్కడి నుంచి బ్రూక్ మోత మొదలైంది. ఫెర్గూసన్ వేసిన 15వ ఓవర్లో బ్రూక్ 6,4,4,4,4, దంచడంతో 23 పరుగులు రాగా.. తదుపరి ఓవర్లో బ్రూక్, అభిషేక్ మూడు ఫోర్లు రాబట్టారు. ఈ క్రమంలో బ్రూక్ 55 బంతుల్లో ఐపీఎల్లో తొలి శతకం నమోదు చేసుకున్నాడు.
హైదరాబాద్: 228/4 (బ్రూక్ 100 నాటౌట్; మార్క్మ్ 50; రస్సెల్ 3/22, వరుణ్ చక్రవర్తి 1/41),
కోల్‌కతా: 20 ఓవర్లలో 205/7 (రాణా 75, రింకూ సింగ్ 58 నాటౌట్; జాన్సెన్ 2/37, మార్కండే 2/27).