ఐపీఎల్లో నయా సంచలనం! ఇన్నాళ్లు తమ పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను గడగడలాడించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)..బ్యాటింగ్‌లో దుమ్మురేపింది. ఉప్పల్ స్టేడియంలో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఊచకోత కోస్తూ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల రికార్డును అందుకుంది.
SRH | 11 ఏండ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఆర్సీబీ రికార్డును బద్దలు కొడుతూ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. క్లాసెన్, అభిషేక్‌శర్మ, ట్రావిస్ హెడ్ అర్ధసెంచరీల వీరవిహారంతో ముంబై బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. ఫోర్లు, సిక్సర్లతో ఉప్పల్‌లో పరుగుల సునామీ సృష్టించడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. భారీ లక్ష్యఛేదనలో తిలక్‌వర్మ, డేవిడ్ పోరాడినా.. ముంబై విజయాన్నందుకోలేకపోయింది.
వేసవి వేళ ఉప్పల్ స్టేడియం పరుగుల జడివానలో తడిసి ముద్దయింది. బుధవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ విజయాన్నందుకుంది. క్లాసెన్, అభిషేక్‌శర్మ, ట్రావిస్ హెడ్ అర్ధసెంచరీల వీరవిహారంతో హైదరాబాద్.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక (277-3) పరుగుల రికార్డును సొంతం చేసుకుంది. 11 ఏండ్ల ఆర్సీబీ(263-5) రికార్డును బద్దలు కొడుతూ హైదరాబాద్ నయా రికార్డు సృష్టించింది. లక్ష్యఛేదనలో ముంబై చతికిలబడింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఐపీఎల్లో మరో చిరస్మరణీయ పోరు అభిమానులను కట్టిపడేసింది. బుధవారం ఉప్పల్ స్టేడియంలో సాగిన పరుగుల విధ్వంసకాండలో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించింది. తొలుత క్లాసెన్(34 బంతుల్లో 80 నాటౌట్, 4ఫోర్లు, 7సిక్స్‌లు), అభిషేక్‌శర్మ(23 బంతుల్లో 63, 3ఫోర్లు, 7 సిక్స్‌లు), ట్రావిస్ హెడ్(24 బంతుల్లో 63, 9ఫోర్లు, 3సిక్స్‌లు) అర్ధసెంచరీలతో హైదరాబాద్ 20 ఓవర్లలో 277-3 రికార్డు స్కోరు నమోదు చేసింది. 17 ఏండ్ల ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. హార్దిక్, కోట్జె, చావ్లా ఒక్కో వికెట్ తీశారు. భారీ లక్ష్యఛేదనలో ముంబై 20 ఓవర్లలో 246-5 స్కోరు చేసింది. తిలక్‌వర్మ(34 బంతుల్లో 64, 2ఫోర్లు, 6సిక్స్‌లు), టిమ్ డేవిడ్(22 బంతుల్లో 42, 2ఫోర్లు, 3సిక్స్‌లు) రాణించారు. ఉనద్కత్(2-47), కమిన్స్(2-35) రెండేసి వికెట్లు తీశారు. అభిషేక్‌శర్మకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
‘హెడ్’ దిమ్మతిరిగేలా..
తొలుత టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా..బౌలింగ్ ఎంచుకున్నాడు. తాను చేసింది తప్పు అని తెలుసుకునేందుకు పాండ్యాకు పెద్ద సమయం పట్టలేదు. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ తరఫున తొలి మ్యాచ్ బరిలోకి దిగిన హార్డ్ హిట్టర్ ట్రావిస్ హెడ్..ముంబై పాలిట విలన్లా మారాడు. ఎదుర్కొన్న మొదటి బంతినే ఫోర్‌గా మలిచిన హెడ్..తన దూకుడు ఏంటో చేతల్లో చూపెట్టాడు. హార్దిక్ పాండ్యా వేసిన రెండో ఓవర్ మొదటి బంతికి ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హెడ్ ఇచ్చిన క్యాచ్‌ను టిమ్ డేవిడ్ జారవిడిచాడు. దీంతో లైఫ్ దక్కించుకున్న హెడ్ మళ్లీ తిరిగి చూసుకోలేదు. దక్షిణాఫ్రికా యువ బౌలర్ క్వెనా ఎంఫకా మూడో ఓవర్ నుంచి హెడ్ విధ్వంసక రచనకు తెరతీశాడు. వరుస బంతుల్లో రెండు భారీ సిక్స్‌లు, రెండు ఫోర్లతో పరుగుల సునామీకి గేట్లు ఎత్తాడు. ఈ పరుగుల హోరుకు బుమ్రా ఒకింత బ్రేక్‌లు వేసినా లాభం లేకపోయింది. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (11) నిరాశపరిచినా.. హెడ్ బ్యాటు ఝులిపించడం ఆపలేదు. హార్దిక్ ఐదో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో ఈ హార్డ్ హిట్టర్ చెలరేగడంతో స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. తన బ్యాటింగ్ జోరును టాప్‌గేర్‌కు మార్చిన హెడ్..గెరాల్డ్ కొట్జెను రెండు ఫోర్లు, భారీ సిక్స్‌తో అరుసుకున్నాడు. ఈ క్రమంలో 18 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు.
అభిషేక్..ఆకాశమే హద్దుగా..
ఓ ఎండ్‌లో హెడ్ వీరవిహారం చేస్తే..మరో ఎండ్‌లో యువ బ్యాటర్ అభిషేక్‌శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అగ్నికి ఆజ్యం పోసినట్లు ముంబై బౌలర్లను చీల్చిచెండాడాడు. చావ్లాను లక్ష్యంగా చేసుకుంటూ అభిషేక్ రెండు వరుస సిక్స్‌లతో ఎస్ఆర్హెచ్ 7వ ఓవర్లోనే 100 పరుగుల మార్క్ అందుకుంది. కోట్జె వేసిన 8వ ఓవర్లో హెడ్ క్యాచ్ ఔట్ కావడంతో రెండో వికెట్‌కు 23 బంతుల్లో 68 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. తిరిగి బౌలింగ్‌కు వచ్చిన ఎంఫకాను ఈ సారి అభిషేక్ రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 16 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇలా ఒకే మ్యాచ్‌లో అభిషేక్, హెడ్ తక్కువ బంతుల్లో 50 పరుగుల మార్క్‌ను అందుకుని హైదరాబాద్ సత్తాచాటారు.
క్లాసెన్ నాటు కొట్టుడు
హెడ్, అభిషేక్ ధనాధన్ ఇన్నింగ్స్‌ను తలదన్నుతూ క్లాసెన్..ముంబై బౌలర్లను ఉతికి ఆరేశాడు. ముఖ్యంగా ఎంఫకాను లక్ష్యంగా చేసుకున్న క్లాసెన్ కుర్చీ మడత పెట్టి కొట్టినట్లు కొట్టాడు. ఒక భారీ సిక్స్, రెండు ఫోర్లతో 18 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు. 23 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్ అందుకున్న క్లాసెన్..ముంబైకి మరింత ప్రమాదకరంగా మారాడు. బుమ్రా 19వ ఓవర్లో 13 పరుగులకే పరిమితమైనా..షమ్స్ ములానీ ఆఖరి ఓవర్లో క్లాసెన్ రెండు కండ్లు చెదిరే సిక్స్‌లకు తోడు ఫోర్‌తో హైదరాబాద్‌కు ఐపీఎల్లో రికార్డు స్కోరు కట్టబెట్టాడు.
పిన్న వయస్సులో ఐపీఎల్ ఆడిన మూడో విదేశీ క్రికెటర్ క్వెన ఎంఫకా.. అతడి వయసు 17 ఏండ్ల 354 రోజులు. అఫ్గాన్ క్రికెటర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ (17 ఏండ్ల 11 రోజులు) ఈ జాబితాలో ముందున్నాడు. ఓవరాల్‌గా ఈ లీగ్‌లో చిన్న వయసులోనే ఆడిన క్రికెటర్ ప్రయాస్ రే బర్మన్. 2019 సీజన్లో ఆర్సీబీ తరఫున ఆడేప్పుడు అతడి వయసు 16 ఏండ్ల 157 రోజులు.
రోహిత్ శర్మకు ముంబై ఇండియన్స్ తరఫున 200వ మ్యాచ్. ఒక జట్టు తరఫున 200+ మ్యాచ్‌లు ఆడిన మూడో క్రికెటర్ రోహిత్.. కోహ్లీ (ఆర్సీబీ, 239), ధోని (చెన్నై, 221)లు ముందున్నారు. హిట్‌మ్యాన్‌కు ఇది 245వ ఐపీఎల్ మ్యాచ్.
అభిషేక్ శర్మ 16 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. ముంబైతో మ్యాచ్‌లోనే ట్రావిస్ హెడ్ 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. హైదరాబాద్ తరఫున డేవిడ్ వార్నర్ 2015, 17 సీజన్లలో చెన్నై, కేకేఆర్‌లపై 20 బంతుల్లోనే ఫిఫ్టీలు బాదాడు. 10 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోరు 148/2. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యుత్తమం. ఇదే మ్యాచ్‌లో ముంబై 141/2 చేసింది. 2021 సీజన్లో ముంబై.. హైదరాబాద్‌పై 131/3 చేయడమే ఇప్పటిదాకా రికార్డు.
థ్యాంక్యూ బాయ్స్
ఐపీఎల్లో కొత్త రికార్డు. 20 ఓవర్లలో 277 పరుగులు..! ఎస్ఆర్హెచ్ బ్యాటర్ల అద్భుతమైన పవర్ హిట్టింగ్ పర్ఫార్మెన్స్. హైదరాబాద్‌ను ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్యూ బాయ్స్.
– ఎక్స్‌లో కేటీఆర్
స్టేడియం హాజరు: 33,426 మంది
హైదరాబాద్ 277-3
ముంబై 246-5
ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధికం నమోదైన సిక్సర్లు ; 38
ఇరుజట్లు చేసిన పరుగులు ; 523
ఐపీఎల్లో అత్యధిక స్కోర్లు
సంక్షిప్త స్కోర్లు
హైదరాబాద్: 20 ఓవర్లలో 277-3 (క్లాసెన్ 80, అభిషేక్‌శర్మ 63, హెడ్ 62, చావ్లా 1-34, హార్దిక్ 1-46), ముంబై: 246-5(తిలక్‌వర్మ 64, డేవిడ్ 42 నాటౌట్, కమిన్స్ 2-35, ఉనద్కత్ 2-47).