Sunil Gavaskar : వరల్డ్ కప్ విజేతగా యావత్ భారతాన్ని సంబురాల్లో ముంచెత్తిన మహిళా క్రికెటర్లపై కానుకలు కురుస్తున్నాయి. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వాలు భారీ నగదు ప్రోత్సాహకాలతో అభినందిస్తుంటే.. మరోవైపు ప్రచారకర్తలుగా మీరే కావాలని పలు కంపెనీలు కోరుతున్నాయి. ప్రపంచకప్ ఛాంపియన్లతో తమ బ్రాండ్ వాల్యూ పెంచుకునేందుకు పలు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లను సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) హెచ్చరించాడు. ప్రచారం కోసం పాకులాడే కొన్ని కంపెనీల పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) మాయలో పడొద్దని.. తస్మాత్ జాగ్రత్త అని సన్నీ సూచించాడు.
ప్రపంచ కప్ విజయోత్సాహంలో ఉన్న భారత క్రికెటర్లతో ఒప్పందం కోసం పలు బ్రాండ్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థలు స్టార్ ప్లేయర్లను సంప్రదించాయి కూడా. పేరుకు పేరు ఆదాయానికి ఆదాయం వచ్చే అవకాశముండడంతో క్రికెటర్లు ఓకే చెప్పడం ఆలస్యం కాకపోవచ్చు. అయితే.. కొన్ని కంపెనీలు అబద్దపు వాగ్దానాలు చేస్తాయని, ఆశపడి మోసపోవద్దని హర్మన్‌ప్రీత్ కౌర్ బృందాన్ని గవాస్కర్ హెచ్చరిస్తున్నాడు. అతడు ఊరికనే భారత క్రికెటర్లకు సూచనలు చేయడం లేదు. 1983లో తొలిసారి విశ్వ విజేతగా నిలిచిన తమకు ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ‘జాగ్రత్త సుమా’ అని చెబుతున్నాడు.
A word of caution from Sunil Gavaskar to the World Cup-winning India team! 👀#CricketTwitter pic.twitter.com/uAnJqJ6cTc
— Female Cricket (@imfemalecricket) November 10, 2025
‘కపిల్ దేవ్ సారథ్యంలో భారత జట్టు 1983 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. అప్పటి జట్టులోని క్రికెటర్లను మీడియా ఆకాశానికెత్తేసింది. పలు కంపెనీలు కొన్ని హామీలు ఇచ్చాయి. కానీ, చివరకు అవేమీ మా చేతికి అందలేదు. అలాఅనీ మీడియాను తప్పుపట్టను. ఎందుకంటే వాళ్లకు మా ద్వారా మరింత ప్రచారం వచ్చింది. అందుకే చెబుతున్నా మీకు ప్రామిస్ చేసిన కొన్ని అవార్డులు రాలేదని నిరాశ చెందకండి. భారత్‌లోని కంపెనీలు, ప్రకటన సంస్థలు, కొందరు వ్యక్తులు ఉచిత పబ్లిసిటీ కోసం కాచుకొని ఉంటారు. వరల్డ్ కప్ విజేతలను ప్రచారకర్తలుగా నియమించుకుంటామని చెప్పి.. తమ ఉత్పత్తులను అమ్ముకోవాలని చూస్తారు.
Countless memories 🫶
An unforgettable night ✨2nd November 2025 will forever hold the most special place in our hearts 💙#TeamIndia | #WomenInBlue | #CWC25 | #Champions | @adidas | @apollotyres pic.twitter.com/KT39iDX5Wt
— BCCI Women (@BCCIWomen) November 3, 2025
అంతేకాదు ఛాంపియన్లను అభినందిస్తూ పలు బ్రాండ్లు పెద్ద పెద్ద హోర్డింగ్‌లు పెడుతుంటాయి. అలా అనీ వారికి, క్రికెటర్లతో ఏ సంబంధమూ ఉండదు. పరోక్షంగా తమ కంపెనీ ప్రచారం కోసం సదరు సంస్థలు సిగ్గు లేకుండా అలా చేస్తుంటాయి. కానీ, కొందరు మాట తప్పకుండా అంబాసిడర్‌గా నియమించుకుంటారు. అందుకే.. ప్రకటనల విషయంలో కాస్త ఆచితూచి అడుగేయండి’ అని విశ్వ విజేతలకు గవాస్కర్ కీలక సూచనలు చేశాడు. వరల్డ్ కప్ విజయంతో భారత మహిళా క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ రెండింతలు పెరిగింది. సెమీఫైనల్లో అజేయ సెంచరీ బాదిన జెమీమా రోడ్రిగ్స్ బ్రాండ్ వాల్యూ రూ.60 లక్షల నుంచి రూ.1.5 కోట్లకు.. ఫైనల్ స్టార్ షఫాలీ బ్రాండ్ వాల్యూ రూ.1 కోటికి చేరిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.