Sunil Gavaskar : అహ్మదాబాద్ టెస్టులో శతకం బాదిన భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (shubman gill)పై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) ప్రశంసలు కురిపించాడు. అతను చాలా ఈజీగా టెస్టుల్లో 8వేల నుంచి 10 వేల పరుగులు చేస్తాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘టెస్టు క్రికెట్లో ఉండాల్సింది డిఫెన్స్. గిల్‌కు చాలా సమయం ఉంది. అతడి డిఫెన్స్ అమోఘం. మిచెల్ స్టార్క్ (Mitchell Starc) బౌలింగ్‌లోనూ గిల్ ముందుకు వంగి బంతిని డిఫెండ్ చేయడం మళ్లీ మళ్లీ చూడాలనిపించింది. అది అతడి ఆత్మవిశ్వాసానికి అద్దం పడుతుంది.
ఈ యంగ్ ఓపెనర్ బ్యాక్‌ఫుట్ మాత్రమే కాదు పాదాలను చాకచాక్యంగా కదిలిస్తూ బ్యాటింగ్ చేయగలడు. టెస్టుల్లో రాణించాలంటే డిఫెన్స్ చాలా ముఖ్యం ఆ విషయంలో శుభ్‌మన్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఈ ఫార్మాట్లో అతను ఈజీగా 8వేల నుంచి పది వేల రన్స్ కొడతాడు’ అని గవాస్కర్ తెలిపాడు.
టెస్టు ఫార్మాట్లో ముగ్గురు భారత క్రికెటర్లు మాత్రమే 10 వేలకు పైగా పరుగులు సాధించారు. వాళ్లు ఎవరంటే..? లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid), సునీల్ గవాస్కర్ మాత్రమే ఇప్పటివరకు టెస్టుల్లో పది వేల రన్స్ కొట్టారు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్టులో శుభ్‌మన్ గిల్ (128)శతకంతో మెరిశాడు. టెస్టుల్లో రెండు సెంచరీ నమోదు చేశాడు. అంతేకాదు ఒకే ఏడాది మూడు ఫార్మాట్లలో వంద కొట్టిన పదో బ్యాటర్‌గా, నాలుగో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇప్పటి వరకు సురేశ్ రైనా, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించారు.