IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 మళ్లీ మొదలు కానున్నది. పాకిస్తాన్-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బీసీసీఐ ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడడంతో ఐపీఎల్ మిగతా మ్యాచులను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 17 నుంచి మిగతా మ్యాచులు జరుగనున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు – కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌తో ఐపీఎల్ పునః ప్రారంభం కానున్నది. ఈ క్రమంలో ఐపీఎల్‌ని సాధారణంగానే నిర్వహించాలని బీసీసీఐకి టీమిండియా దిగ్గజ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్ విజ్ఞప్తి చేశారు.
ఇటీవల చాలామంది తమ ప్రియమైన వారిని కోల్పోయారని.. మ్యాచుల సమయంలో స్టేడియంలో మ్యూజిక్, డీజేని ప్లే చేయొద్దని రిక్వెస్ట్ చేశారు. మెగా ఈవెంట్లో ఇప్పటి వరకు దాదాపు 60 మ్యాచులు ఆడామని.. ఇంకా 15-16 మ్యాచులు మిగిలి ఉన్నాయనుకుంటున్నానన్నారు. పెహల్గాం ఘటనతో పాటు సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయిన విసయం తెలిసిందే. ఈ క్రమంలో మ్యాచ్ సమయంలో మ్యూజిక్, డీజేనీ ఉపయోగించకూడదని ఆశిస్తున్నానన్నారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాల భావాలను గౌరవించడం అవసరమని గవాస్కర్ పేర్కొన్నారు. మ్యాచ్ సమయంలో చీర్‌లీడర్స్ ఉండకూడదన్నారు. తమవారిని కోల్పోయిన కుటుంబాల భావాలను మనం గౌరవించగలిగేలా క్రికెట్ మాత్రమే ఆడాలన్నారు.
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్‌ను బీసీసీఐ వారం రోజుల పాటు వాయిదా వేసింది. అంతకు ముందురోజు ధర్మశాలలో పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ సైతం రద్దయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఐపీఎల్లో 57 మ్యాచులు జరిగాయి. ఫైనల్‌తో సహా 17 మ్యాచుల కోసం బీసీసీఐ సవరించిన షెడ్యూల్‌ని ప్రకటించింది. రద్దయిన పంజాబ్-ఢిల్లీ మ్యాచ్ మళ్లీ నిర్వహించనున్నారు. రెండుజట్ల మధ్య మ్యాచ్ మే 24న జైపూర్‌లో జరుగనున్నది. వాస్తవానికి మొదట ప్రకటించిన షెడ్యూల్ మే 25న జరగాల్సి ఉండగా.. ప్రస్తుతం సవరించిన షెడ్యూల్ మేరకు మే 3న జరుగనున్నది.