Sunil Gavaskar : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Boarder-Gavaskar Trophy) రెండో టెస్టు (Second test) లో ఓడి సిరీస్‌ను 1-1 తో సమం అయ్యేలా చేసిన భారత పురుషుల క్రికెట్ జట్టుకు లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) ఘాటైన సందేశం ఇచ్చారు. హోటల్ గదుల్లో కూర్చుని సమయాన్ని వృథా చేయకుండా బయటికొచ్చి ప్రాక్టీస్ చేయాలని సీరియస్ కామెంట్ చేశారు. ఇకనైనా ఈ సిరీస్‌ను మూడు మ్యాచ్‌ల సిరీస్‌గా భావించి సీరియస్‌గా ఆడాలని హితవు పలికారు.
మూడు రోజులకే ముగిసిన రెండో టెస్టులో భారత్ ఏ కోశాన కూడా ఆస్ట్రేలియాకు సరైన పోటీ ఇవ్వలేకపోయింది. మ్యాచ్ ఆద్యంతం ఆస్ట్రేలియాదే పైచేయిగా సాగింది. దాంతో మూడో రోజు రెండో సెషన్లోనే మ్యాచ్ ముగిసింది. భారత్ నిర్దేశించిన 19 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ వికెట్ నష్టపోకుండా చేధించింది. భారత్ 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘ఇకనైనా ఈ సిరీస్‌ను మూడు టెస్టుల సిరీస్‌గా భావించి సీరియస్‌గా ఆడండి. ఇది ఐదు టెస్టుల సిరీస్ అనే సంగతి మర్చిపోండి. నేను టీమిండియాకు చెప్పదల్చుకున్నది ఏమిటంటే వచ్చే రెండు రోజులైనా బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ రెండు రోజుల ప్రాక్టీస్ చాలా ముఖ్యం. ఈ రెండు రోజులు హోటల్ రూమ్‌లో కూర్చోవడమో, లేదంటే ఎటైనా వెళ్లడమో చేయకండి. ఎందుకంటే మీరిక్కడికి క్రికెట్ ఆడటానికి వచ్చారు’ అని గవాస్కర్ తన సందేశంలో పేర్కొన్నారు.
‘మీరు రోజంతా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఉదయంగానీ, మధ్యాహ్నం గానీ మీకు వీలైన ఒక సెషన్లో ప్రాక్టీస్ చేయవచ్చు. అంతేగానీ సమయం వృథా చేయకండి. ఐదు రోజులు మ్యాచ్ ఆడాలంటే ఆమాత్రం ప్రాక్టీస్ ఉండాలి’ అని గవాస్కర్ సూచించారు. అంతేగాక భారత ఆటగాళ్ల పేలవమైన ఆటతీరువల్లే రెండో టెస్టులో ఓటమి ఎదురైందని ఆయన వ్యాఖ్యానించారు. బ్యాటర్లుగానీ, బౌలర్లుగానీ ఏమాత్రం మంచి ప్రదర్శన ఇవ్వలేదని పెదవి విరిచారు.
ఇప్పటికైనా ఆటగాళ్లు రిథమ్ అందుకోవాలని గవాస్కర్ అన్నారు. అందుకు రెండు రోజుల సమయం అదనంగా దొరికిందని చెప్పారు. రిథమ్ కోల్పోవడంవల్లే బ్యాటర్లు పరుగులు రాబట్టడంలో, బౌలర్లు వికెట్లు తీయడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. కెప్టెన్, కోచ్ కూడా ఆటగాళ్లకు ప్రాక్టీస్ విషయంలో ఆప్షన్లు ఇవ్వడం మానుకోవాలని సూచించారు. అందరూ ప్రాక్టీస్ చేయాల్సిందే అన్నారు. కాగా సిరీస్‌లో భాగంగా మూడో టెస్టు బ్రిస్బేన్‌లో ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుంది.