ఓవల్: ఇండియన్ పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్(Mohammed Siraj) వైఖరిపై సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో రెండో రోజు స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సిరాజ్ అతనిపైకి బంతిని విసిరేశాడు. ఆ ఘటన పట్ల సునీల్ గవాస్కర్, రవిశాస్త్రిలు స్పందించారు. సిరాజ్ శైలి తమను నిరుత్సాహపరిచినట్లు ఆ ఇద్దరూ తమ కామెంటరీలో పేర్కొన్నారు. 95 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్మిత్ వరుసగా రెండు బౌండరీలు కొట్టాడు. అయితే నాలుగో బంతి బౌల్ చేయడానికి ముందు.. స్పైడర్ క్యామ్ వల్ల స్మిత్ పక్కకు జరిగాడు. రనప్‌లో ఉన్న సిరాజ్ తన చేతుల్లో ఉన్న బంతిని వికెట్ల మీదకు విసిరేశాడు.
ఈ ఘటన పట్ల గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అసలు ఏం జరుగుతోందని ఆయన తన కామెంటరీలో పేర్కొన్నాడు. ఆట ఆరంభమై రెండుమూడు బంతులు కాలేదు అప్పుడే ఇదేంటని గవాస్కర్ తన కామెంటరీలో చెప్పాడు. ఇక మాజీ కోచ్ రవి శాస్త్రి కూడా సిరాజ్ టెంపర్‌ను ప్రశ్నించాడు. బంతి పడడానికి ముందు స్మిత్ పక్కకు జరిగేందుకు హక్కు ఉందని రవిశాస్త్రి అన్నాడు. స్మిత్ బంతి పడటానికి ముందు జరిగాడని, కానీ రెండు బౌండరీలు కొట్టడం వల్ల సిరాజ్‌లో అసహనం కనిపించిందని, అంతకుముందు బంతికి రోహిత్ శర్మ అరిచాడని కూడా శాస్త్రి తన కామెంటరీలో పేర్కొన్నాడు.