మెల్బోర్న్: భారత యువ టెన్నిస్ ఆటగాడు సుమీత్ నాగల్.. సీజన్ ఆరంభ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన క్వాలిఫయింగ్ మూడో రౌండ్లో నాగల్ 6-4, 6-4తో అలెక్స్ మాల్కాన్ (స్లొవేకియా)పై విజయం సాధించాడు. గంటకు పైగా సాగిన పోరులో ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురైనా.. ఎక్కడ వెనక్కి తగ్గకుండా నాగల్ అదరగొట్టాడు. దీంతో రెండోసారి ఆస్ట్రేలియా ఓపెన్ మెయిన్ డ్రాలో అడుగుపెట్టాడు. ‘గ్రాండ్‌స్లామ్‌కు అర్హత సాధించడం గొప్పగా ఉంది. దీని కోసం ఎంతో కష్టపడ్డా. గాయం నుంచి కోలుకున్న తర్వాత తిరిగి సత్తాచాటడం ఆనందంగా ఉంది’ అని మ్యాచ్ అనంతరం నాగల్ అన్నాడు. తొలి రౌండ్లో ప్రపంచ 31వ ర్యాంకర్ అలెగ్జాండర్ బబ్లిక్ (కజకిస్థాన్)తో 139వ ర్యాంకర్ నాగల్ తలపడనున్నాడు.