హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన 11వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్ క్రీడా పోటీల్లో మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు స్వర్ణ పతకాలతో సత్తా చాటారు. ఈనెల 3, 4 తేదీల్లో జరిగిన పోటీల్లో మహబూబ్ నగర్ జిల్లాలోని కోయిల్ కొండ బీసీ గురుకుల కాలేజీలో ఇంటర్ సెకండీయర్ చదువుతున్న కే. శివకుమార్.. 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెంలో రెండు స్వర్ణ పతకాలు సాధించాడు.
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలోని బీసీ గురుకుల కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న భరత్.. 600 మీటర్ల రేసులో పసిడి పతకం గెలుచుకున్నాడు. పతకాలు గెలిచిన విద్యార్థులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సెక్రటరీ శ్రీధర్ తదితరులు అభినందించారు.