Greatest ODI Player : ‘వన్డేల్లో అత్యుత్తమ ఆటగాడు ఎవరు?’ అనే చర్చ ఎప్పటినుంచో నడుస్తోంది. సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్(Ricky Ponting), విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ.. ‘ఈ నలుగురిలో గ్రేటెస్ట్ ఎవరు?’ అని తేల్చడం చాలా కష్టమని, ఎవరికివారే గొప్పని కొందరు వాదించారు. అయితే.. ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్ వా (Steve Waugh) మాత్రం తన ఓటు కోహ్లీకే అంటున్నాడు. వన్డే క్రికెట్లో ఆల్ టైమ్ గ్రేట్ ఆటగాడు విరాటేనని కుండబద్దలు కొట్టేశాడీ ఆసీస్ మాజీ సారథి. అలాఅనీ అతడు రికార్డులు చూసి ఈ మాట చెప్పడం లేదు. కోహ్లీ ఆటను, ప్రతిభను, స్ఫూర్తినిచ్చే వ్యక్తిత్వాన్ని కలగలిపి ఈ ప్రకటన చేశాడు.
ప్రస్తుతం వన్డే ఫార్మాట్లోనే కొనసాగుతున్న విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటనను ఘనంగా ముగించాడు. వచ్చే వన్డే వరల్డ్ కప్‌తో కెరీర్ ముగించాలనుకుంటున్న విరాట్‌పై స్టీవ్ వా ప్రశంసలు కురిపించాడు. గురువారం యాషెస్ ట్రోఫీ ఆవిష్కరణ సమయంలో మీడియాతో మాట్లాడిన ఆసీసీ మాజీ కెప్టెన్ తనకు కోహ్లీ ఆట అంటే ఎంతో ఇష్టమని చెప్పాడు. ‘నిలకడగా రాణించడం, పరుగులు సాధించాలనే ఆకలితో ఉండడం వంటి లక్షణాల ద్వారా కోహ్లీ ప్రపంచ క్రికెట్లో కొత్త ప్రమాణాలు నెలకొల్పాడు. ఒకతరంలో మాత్రమే కనిపించే క్రికెటర్లలో విరాట్ ఒకడు. అతడు అసాధారణ ప్రతిభావంతుడు. అందుకే అవకాశం దొరికితే కచ్చితంగా కోహ్లీ ఆట చూడండి’ అని అభిమానులను కోరాడు స్టీవ్ వా.
Steve Waugh showers praise on Virat Kohli, calling him the greatest one-day player of all-time.#TeamIndia #ViratKohli pic.twitter.com/pYBrqTjyoC
— Circle of Cricket (@circleofcricket) November 6, 2025
ప్రపంచానికి విరాట్, రోహిత్ రూపంలో ఇద్దరు గొప్ప వన్డే ప్లేయర్లను భారత్ అందించిందని స్టీవ్ వా అభిప్రాయపడ్డాడు. ‘కోహ్లీ, రోహిత్ ఇద్దరూ ఆల్‌టైమ్ గ్రేట్ క్రికెటర్లు. అయితే.. హిట్‌మ్యాన్ కంటే కోహ్లీ ఇంకా గ్రేట్. వన్డే క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడు అతడు. రోకో ఆట చూడాలని అందరూ ఆశపడుతారు. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ ప్రజలు కూడా వీరిద్దరు చెలరేగి ఆడడాన్ని ఆస్వాదిస్తారు. అయితే.. ప్రస్తుతం విరాట్, రోహిత్‌లు అన్ని మ్యాచ్‌లు ఆడడం లేదు’ అని స్టీవ్ వా పేర్కొన్నాడు.
రన్ మెషీన్‌గా అభిమానులకు సుపరిచితమైన కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటనలో రికార్డులు నెలకొల్పాడు. తన సుదీర్ఘ కెరీర్లో తొలిసారి వరుసగా రెండు వన్డేల్లో డకౌట్లతో నిరాశపరిచిన విరాట్.. సిడ్నీలో మాత్రం అలరించాడు. సూపర్ ఫిఫ్టీ బాదిన అతడు 50 ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. సిడ్నీ వన్డేలో 52 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద.. కుమార సంగక్కర (Kumar Sangakkara) పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును బద్ధలు కొట్టాడీ స్టార్ క్రికెటర్.
Hence proved: 𝘚𝘢𝘣𝘳 𝘬𝘢 𝘱𝘩𝘢𝘭 𝘩𝘶𝘮𝘦𝘴𝘩𝘢 𝘮𝘦𝘦𝘵𝘩𝘢 𝘩𝘰𝘵𝘢 𝘩𝘢𝘪! 🙌
👉 Virat Kohli’s 75th ODI fifty
👉 His 70th 50+ score in ODI run chases – most by any batter
👉 Completes 2500 runs against AUS in ODIs#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉… pic.twitter.com/Mw6oU1cNzk— Star Sports (@StarSportsIndia) October 25, 2025
ప్రస్తుతం విరాట్ ఖాతాలో 14,235 రన్స్ ఉండగా.. టాప్ స్కోరర్‌గా సచిన్ టెండూల్కర్ కొనసాగుతున్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా పేరొందిన మాస్టర్ బ్లాస్టర్ 18,426 పరుగులతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. అయితే.. వన్డేలు, టీ20లు కలిపితే.. సచిన్ కంటే కోహ్లీ(18,437)నే ఒక పరుగు ముందున్నాడు. ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ 13,704 పరుగులతో మూడో నాలుగో స్థానంలో నిలిచాడు. వన్డేల్లో రెండో అత్యధిక పరుగుల వీరుడిగా అవతరించాడు. ఆసీస్ పర్యటన తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ‘రోకో’ ఆడే అవకాశముంది.