Ashes Series : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా (Australia) త్వరలోనే యాషెస్ సిరీస్ ఆడనుంది. స్వదేశంలో నవంబర్ 21 నుంచి మొదలవ్వనున్న ఈ సిరీస్ తొలి పోరుకు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) దూరమయ్యాడు. వెన్ను గాయంతో బాధ పడుతున్ అతడు పెర్త్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం లేదు. దాంతో.. సీనియర్ బ్యాటర్ అయిన స్టీవ్ స్మిత్ (Steve Smith) మొదటి టెస్టులో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని సోమవారం క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.
సుదీర్ఘ ఫార్మాట్లోని గొప్ప సమరాల్లో ఒకటైన యాషెస్ సిరీస్‌కు ఈసారి ఆస్త్రేలియా ఆతిథ్యం ఇస్తోంది. స్వదేశంలో చెలరేగిపోయే ఆసీస్ ఈసారి కూడా ఇంగ్లండ్‌ను చిత్తు చేసేందుకు సిద్దమవుతోంది. అయితే.. ఆరంభ మ్యాచ్‌కు కెప్టెన్ కమిన్స్ దూరమవ్వడం ఆ జట్టుకు కొంత ఇబ్బందికరమే. ఎందుకంటే.. తనవైన వ్యూహాలతో ప్రత్యర్థిని దెబ్బతీసే కమిన్స్ బంతితో, బ్యాటుతోనూ రాణించగల సమర్దుడు. వెన్ను గాయం(Back Stress Injury)తో వరుసగా న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరమైన ప్యాటీ.. ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నాడు. గబ్బాలో డిసెంబర్ 4న జరుగనున్న రెండో టెస్టులోపు ఫిట్నెస్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు కమిన్స్. ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ సైతం అతడు గబ్బాలో ఆడుతాడనే ఆశాభావంతో ఉన్నాడు.
Steve Smith is unbeaten when standing in for Pat Cummins, including one win in the 2021-22 Ashes 🇦🇺 pic.twitter.com/f9zqJXCCvt
— ESPNcricinfo (@ESPNcricinfo) October 27, 2025
ఐదు మ్యాచ్‌ల యాషెస్ మెగా సమరానికి నెల రోజులు కూడా లేకపోవడంతో ఓపెనర్లను ఖరారు చేయడంపై ఆసీస్ సెలెక్టర్లు, కోచ్‌లు మల్లగుల్లాలు పడుతున్నారు. డేవిడ్ వార్నర్ (David Warner) వీడ్కోలు తర్వాత నుంచి కంగారూ టీమ్‌కు అతడిలా దూకుడుగా ఆడగల ఓపెనర్ దొరకడం లేదు. భారత్‌తో సిరీస్‌లో ఉస్మాన్ ఖవాజాకు జోడీగా.. కుర్రాళ్లు నాథన్ మెక్‌స్వీనే, హ్యారిస్‌లను ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దాంతో.. సీనియర్ మార్నస్ లబూషేన్ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం.
The dates are out for the 2025-26 #Ashes series pic.twitter.com/CxKaovXBcz
— ESPNcricinfo (@ESPNcricinfo) October 16, 2024
ఇక తొలి టెస్టులో కమిన్స్ ఆడడం లేదు కాబట్టి స్కాట్ బోలాండ్‌ను తీసుకోవాలని ఆసీస్ కోచ్ మెక్‌డొనాల్డ్ భావిస్తున్నారు. కమిన్స్ గైర్హాజరీలో ఇప్పటివరకూ ఆరుసార్లు కెప్టెన్సీ చేపట్టిన స్మిత్.. పెర్త్‌లో విజయంతో సిరీస్‌లో జట్టు ముందంజలో ఉండేలా చూడాలనే పట్టుదలతో ఉన్నాడు.