కాలిఫోర్నియా : అమెరికాలో క్రికెట్ అభిమానులను అలరించేందుకు జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) మూడో సీజన్ ఘనంగా ఆరంభమైంది. సాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్ మధ్య కాలిఫోర్నియాలో శుక్రవారం రాత్రి జరిగిన తొలి మ్యాచ్లో.. యూనికార్న్స్ బ్యాటర్ ఫిన్ అలెన్ రికార్డుల మోత మోగించాడు. 34 బంతుల్లోనే సెంచరీ చేసిన ఈ కివీస్ ఓపెనర్..
మొత్తంగా మ్యాచ్లో 51 బంతుల్లో 5 బౌండరీలు, 19 భారీ సిక్సర్లతో 151 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అలెన్.. ఒక టీ20 మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రిస్ గేల్ (18) రికార్డును అధిగమించాడు. అలెన్ దూకుడుతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 269/5 రన్స్ చేసింది. ఛేదనలో వాషింగ్టన్.. 13.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలి 123 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది.