హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 23: తెలంగాణ చెస్ అసోసియేషన్ సహకారంతో వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో రెండు రోజులు నిర్వహించిన అండర్-15 బాలబాలికల రాష్ట్ర స్థాయి చదరంగ పోటీలు బుధవారం ముగిశాయి. బాలుర విభాగం నుంచి యోహాన్, యాదవ్, ప్రణయ్, శ్రీరామ్, అంజనీకుమార్, సాహర్ష, బాలికల కేటగిరీలో యాశ్విజైన్, శరణ్య, సహర్ష, శ్రీలాస్య విజేతలుగా నిలిచారు. వీరంతా నవంబర్ 3 నుంచి 11వ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ తరఫున పోటీ చేయనున్నారు. పోటీల ముగింపు కార్యక్రమానికి చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రవీందర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టోర్నీ నిర్వహణ కార్యదర్శి కన్నా మాట్లాడుతూ ఈ చాంపియన్షిషిప్లో దాదాపు 100మంది పాల్గొన్నారని పేర్కొన్నారు.