PV Sindhu | కుమమొటొ: రెండేండ్లుగా బీడబ్ల్యూఎఫ్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న స్టార్ షట్లర్ పీవీ సింధుకు మరోసారి చుక్కెదురైంది. జపాన్ మాస్టర్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆమె ఓటమిపాలైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 20వ ర్యాంకర్ సింధు.. 21-17, 16-21, 17-21తో మిచెల్లె లి(కెనడా) చేతిలో ఓడిపోయింది.
గంటా 15 నిమిషాల పాటు హోరాహోరిగా జరిగిన మ్యాచ్‌లో సింధు తొలి గేమ్ నెగ్గినప్పటికీ రెండో గేమ్‌లో లి పుంజుకుంది. ఒకదశలో ఇరువురూ 16-16తో సమంగా నిలిచినప్పటికీ మిచెల్లి ధాటిగా ఆడి గేమ్‌ను సొంతం చేసుకుంది. మూడో గేమ్‌లో కెనడా అమ్మాయి వరుసగా 4 పాయింట్లు సాధించి ఆధిక్యంలో నిలవడమే గాక క్వార్టర్స్ పోరుకు అర్హత సాధించింది. సింధు నిష్క్రమణతో ఈ టోర్నీలో భారత్ పోరాటం కూడా ముగిసింది.