Julien Alfred : ఒలింపిక్స్ (Olympics) చరిత్రలోనే తొలిసారి సెయింట్ లూసియా (St Lucia) దేశానికి పతకం దక్కింది. తొలి పతకంగా ఏకంగా గోల్డ్ మెడల్ (Gold medal) నే ఖాతాలో వేసుకుంది. సెయింట్ లూసియా రన్నర్ జూలియన్ ఆల్ఫ్రెడ్ (Julien Alfred) తన దేశానికి తొలి పతకం అందించిన ఘనత దక్కించుకుంది. ఆమె వంద మీటర్ల పరుగు పందెంలో కేవలం 10.72 సెకన్లలో రేసును పూర్తి చేసి పసిడి పతకాన్ని ఒడిసిపట్టింది.
విజయాన్ని ముద్దాడగానే జూలియన్ అల్ఫ్రెడ్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. గట్టిగా అరుస్తూ ఎగిరి గంతులేసింది. ఆ వెంటనే 11 ఏళ్ల క్రితం మరణించిన తన తండ్రిని గుర్తు చేసుకుని బోరున విలపించింది. ఆ తర్వాత తను సాధించిన పతకాన్ని తన తండ్రికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించింది. ‘నా ఈ విజయాన్ని చూడటానికి నా తండ్రి ఇక్కడ లేరు. కానీ నేను ఎప్పటికైనా ఈ ఘనత సాధిస్తామని ఆయనకు గట్టి నమ్మక ఉండేది’ అని జూలియన్ గుర్తు చేసుకున్నారు.
కాగా, ఇదే రేసులో అమెరికా రన్నర్లు రిచర్డ్సన్, మెలిస్సా జఫర్సన్లు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. 10.87 సెకన్ల టైమింగ్తో రేసును పూర్తిచేసి రిచర్డ్సన్ రజతం దక్కించుకోగా, 10.92 సెకన్ల టైమింగ్తో రేసును ముగించి మెలిస్సా జఫర్సన్ కాంస్యం గెలుచుకుంది. కాగా, 1996 అట్లాంటా ఒలింపిక్స్ తర్వాత అమెరికా రన్నర్లు ఒకే ఈవెంట్లో రెండు పతకాలు సాధించడం ఇది తొలిసారి కావడం గమనార్హం.