కౌలాలంపూర్ : మలేషియా మాస్టర్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిదాంబి శ్రీకాంత్ జోరు కొనసాగుతున్నది. తన కంటే మెరుగైన ర్యాంకర్లను చిత్తు చేస్తూ మున్ముందుకు సాగుతున్న శ్రీకాంత్.. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ పోరులోనూ గెలిచి ఏడాది తర్వాత ఒక బీడబ్ల్యూఎఫ్ టోర్నీలో సెమీస్‌కు దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో శ్రీకాంత్.. 24-22, 17-21, 22-20తో జూనియర్ పొపొవ్ (ఫ్రాన్స్)ను ఓడించాడు.
గంటా 14 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో శ్రీకాంత్ తొలి గేమ్‌లో 7-4తో శుభారంభమే చేశాడు. కానీ పొపొవ్ వరుస పాయింట్లతో ఒకదశలో 21-20తో గేమ్‌ను సొంతం చేసుకునే దిశగా కదిలాడు. కానీ అనూహ్యంగా పుంజుకున్న భారత షట్లర్ 24-22తో ప్రత్యర్థికి షాకిచ్చాడు. రెండో గేమ్‌ను పొపొవ్ గెలుచుకున్నాడు. విజేతను నిర్ణయించే మూడో గేమ్‌లో గెలుపు కోసం శ్రీకాంత్ వీరోచితంగా పోరాడి సెమీస్ బెర్తును దక్కించు కున్నాడు. శనివారం జరిగే సెమీస్లోయుషి తనకతో శ్రీకాంత్ తలపడుతాడు.