T20 World Cup | కింగ్స్టౌన్ (సెయింట్ విన్సెంట్): సూపర్-8 చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో బ్యాట్‌తో విఫలమైనా బంతితో ఆకట్టుకున్న బంగ్లాదేశ్.. తమ ఆఖరి లీగ్ పోరును విజయంతో ముగించింది. నేపాల్‌పై 21 పరుగుల తేడాతో గెలిచి తదుపరి దశకు అర్హత సాధించింది. ఈ టోర్నీలో ముందంజ వేయాలంటే భారీ విజయం సాధించాల్సిన దశలో నెదర్లాండ్స్.. శ్రీలంక చేతిలో చిత్తుగా ఓడటం బంగ్లాదేశ్‌కు కలిసొచ్చింది.
సోమవారం కింగ్స్టన్ వేదికగా నేపాల్‌తో జరిగిన గ్రూప్ డీ మ్యాచ్‌లో బంగ్లాదేశ్.. మొదట బ్యాటింగ్ చేస్తూ 19.3 ఓవర్లలో 106 పరుగులకే చేతులెత్తేసింది. నేపాల్ బౌలర్లు కట్టడి చేయడంతో బంగ్లా జట్టులో ఒక్కరైనా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. షకిబ్ అల్ హసన్ (17) టాప్ స్కోరర్. నేపాల్ బౌలర్లలో సోంపల్ (2/10), లమిచానె (2/17), పౌడెల్ (2/20) రాణించారు.
గత మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో ఒక్క పరుగు తేడాతో ఓడిన నేపాల్ ఈ మ్యాచ్‌లోనూ విజయానికి చేరువగా వచ్చింది. కానీ బౌలింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై బంగ్లా బౌలర్, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ తాంజిమ్ హసన్ సకిబ్ (4/7) నిప్పులు చెరగగా ముస్తాఫిజుర్ రెహ్మాన్ (3/7) విజృంభించడంతో నేపాల్.. 19.2 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌట్ అయింది. కుశాల్ (27), దీపేంద్ర (25) పోరాడారు.
లంకకు భారీ విజయం
పొట్టి ప్రపంచకప్‌లో చెత్త ప్రదర్శనలతో తీవ్ర విమర్శలను ఎదుర్కుంటున్న శ్రీలంక తమ ఆఖరి మ్యాచ్‌లో మాత్రం అదిరిపోయే విజయంతో వీడ్కోలు పలికింది. సెయింట్ లూసియా వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్లోలంక బ్యాటర్లు ఝూలు విదిల్చారు. కుశాల్ మెండిస్ (46), చరిత్ అసలంక (46), ధనంజయ డిసిల్వ (34) వీరవిహారం చేయడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో నెదర్లాండ్స్.. 16.4 ఓవర్లలో 116 పరుగులకే చాపచుట్టేసి 83 పరుగుల తేడాతో ఓడింది. లెవిట్ (31), ఎడ్వర్డ్స్ (31) ఫర్వాలేదనిపించారు. నువాన్ తుషారా (3/24), పతిరాన (2/12) రాణించారు. అసలంకకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.