IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ చివరి లీగ్ మ్యాచ్‌కు సిద్ధమైంది సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH). డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)తో కమిన్స్ సేన తలపడుతోంది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచిన కమిన్స్ బ్యాటింగ్ తీసుకున్నాడు. ఈ వేదికపై గత ఆరు మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 3 సార్లు విజయం సాధించగా.. ఛేదనకు దిగిన జట్టు మూడు పర్యాయాలు గెలుపొందింది. దాంతో, చివరి మ్యాచ్‌లో గెలుపొంది టోర్నీకి గౌరవంగా వీడ్కోలు పలికేందుకు ఇరుజట్లు శ్రమించనున్నాయి.
గత మ్యాచ్‌లో ఆర్సీబీపై చెలరేగినట్టే ఈసారి కోల్‌కతాపై దంచికొట్టాలని ఆరెంజ్ ఆర్మీ భావిస్తోంది. మే 17న బెంగళూరుతో జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణం కావడంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలిగిన కోల్‌కతా.. విజయంతో మురిసిపోవాలని అనుకుంటోంది. తుది జట్టులో ఏ మార్పులు లేకుండా ఆడుతున్నామని ఇరువురు కెప్టెన్లు తెలిపారు.