Sunrisers | ఢిల్లీ: భారీ అంచనాలతో ఐపీఎల్-18 బరిలోకి దిగి ఆశించిన స్థాయిలో రాణించలేక ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్).. రికార్డు స్కోర్లు చేయడంలో మాత్రం తమకు తామే సాటి అని మరోసారి నిరూపించుకుంది. ఆదివారం ఢిల్లీలో డిఫెండింగ్ చాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 278 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ లీగ్‌లో ఇది మూడో అత్యధిక స్కోరు.
హెన్రిచ్ క్లాసెన్ (39 బంతుల్లో 105 నాటౌట్; 7 ఫోర్లు, 9 సిక్సర్లు) మెరుపు శతకానికి తోడు ట్రావిస్ హెడ్ (40 బంతుల్లో 76, 6 ఫోర్లు, 6 సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టారు. కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కతా.. 18.4 ఓవర్లలో 168 రన్స్‌కు ఆలౌటై 110 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మనీష్ ఫాండె (37), హర్షిత్ రానా (34*), సునీల్ నరైన్ (31) కేకేఆర్ ఓటమి అంతరాన్ని తగ్గించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఉనద్కత్ (3/24), హర్ష్ దూబె (3/34) రాణించారు.
నోకియా రెండో ఓవర్లో సిక్సర్‌తో హెడ్.. దంచుడుకు ముహూర్తం పెట్టగా అదే ఓవర్లో అభిషేక్ శర్మ (16 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండు బౌండరీలు కొట్టాడు. ఆ తర్వాత హెడ్.. వైభవ్, హర్షిత్ లక్ష్యంగా చేసుకుని వీరబాదుడు బాదడంతో పవర్ ప్లేలోనే ఆ జట్టు 79/0గా నిలిచింది. ‘ట్రావిషేక్’ జోడీ 7 ఓవర్లకే 92 పరుగులతో అదిరిపోయే ఆరంభాన్నిచ్చింది. నరైన్ ఏడో ఓవర్లో అభిషేక్ ఔట్ అయినా మూడో స్థానం లో క్లాసెన్ రాకతో కోల్‌కతా బౌలర్ల పరిస్థితి పె నం మీద నుంచి పొయ్యి లో పడ్డైట్టెంది. వరుణ్ బౌలింగ్‌లో డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాదడంతో హెడ్ అర్ధ శతకం పూర్తయింది. మరో ఎండ్‌లో క్లాసెన్ వచ్చీ రాగానే కేకేఆర్ బౌలర్లపై పిడుగులా విరుచుకుపడటంతో హైదరాబాద్ 10 ఓవర్లకే 139/1 స్కోరు చేసింది.
హర్షిత్ 11వ ఓవర్లో క్లాసెన్.. 4, 6, 6తో 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఎట్టకేలకు నరైన్ 13వ ఓవర్లో హెడ్‌ను ఔట్ చేయడంతో హైదరాబాద్ రెండో వికెట్ కోల్పోయింది. క్లాసెన్‌తో కలిసి హెడ్ రెండో వికెట్‌కు 35 బంతుల్లోనే 83 రన్స్ జోడించాడు. హెడ్ నిష్క్రమించినా క్లాసెన్ దూకుడు తగ్గలేదు. ఇషాన్ కిషన్ (29) అండగా అతడు మరింత రెచ్చిపోయి ఆడటంతో 15 ఓవర్లకే సన్‌రైజర్స్ 200 దాటింది. రసెల్ ఓవర్లో 4, 6, 4తో 90లలోకి వచ్చిన క్లాసెన్.. వైభవ్ 19వ ఓవర్లో వేసిన ఆఖరి బంతిని మిడ్ వికెట్ దిశగా తరలించి తన కెరీర్లో రెండో ఐపీఎల్ శతకాన్ని నమోదుచేశాడు. ఇషాన్‌తో మూడో వికెట్‌కు క్లాసెన్.. 36 బంతుల్లో 83 రన్స్ జతచేశాడు.
హైదరాబాద్: 20 ఓవర్లలో 278/3 (క్లాసెన్ 105*, హెడ్ 76, నరైన్ 2/42, వైభవ్ 1/39) కోల్‌కతా: 18.4 ఓవర్లలో 168 ఆలౌట్ (మనీష్ 37, హర్షిత్ 34*, ఉనద్కత్ 3/24, హర్ష్ 3/34).
ఎస్ఆర్హెచ్ 287/3 X బెంగళూరు, 2024
ఎస్ఆర్హెచ్ 286/6 X రాజస్థాన్, 2025
ఎస్ఆర్హెచ్ 278/3 X కోల్‌కతా, 2025
ఎస్ఆర్హెచ్ 277/3 X ముంబై, 2024