అదనపు పాసుల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు తమను బెదిరిస్తున్నారని, ఇది ఇలాగే కొనసాగితే హైదరాబాద్‌ను వీడి వెళ్లిపోతామని హెచ్చరించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఆరోపణలపై హెచ్‌సీఏ స్పందించింది. ఎస్ఆర్హెచ్ విడుదల చేసిన ఈ-మెయిల్‌కు హెచ్‌సీఏ సుదీర్ఘ వివరణ ఇస్తూ తమ పరువుకు భంగం కలిగించేలా చేయడం సబబు కాదని పేర్కొంది. ‘కోటాకు మించి మిమ్మల్ని (ఎస్ఆర్హెచ్) అదనపు పాసుల కోసం మేము (హెచ్‌సీఏ) ఎప్పుడూ అడగలేదు. గత రెండు మ్యాచ్‌లలో మీరు మాకు ఇచ్చింది 3,880 కాంప్లిమెంటరీ పాస్‌లే. ఎఫ్-12 ఏ బాక్సులో సామర్థ్యానికి మించి మీరు 50 టికెట్లు ఇస్తామంటే మేము ఆ బాక్సులో 30 ఇచ్చి మిగిలిన 20 పాసులను మరో బాక్సులో సర్దుబాటు చేయమన్నాం. దానికి ఈనెల 27న ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు కిరణ్, శరవాణన్, రోహిత్ అంగీకరించారు. ముందు అంగీకరించి తర్వాత ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే అర్థంతో ఈ-మెయిల్లో ఆరోపణలు చేయడం ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు. అధ్యక్షుడు జగన్మోహన్ రావు తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం అదనంగా మరో 10 శాతం టికెట్లు ఇవ్వాలని ఎస్ఆర్హెచ్ను ఎప్పుడూ అడగలేదని స్పష్టం చేస్తున్నాం. ఇక స్టేడియం ఆధునీకరణ పనుల విషయంలోనూ మీరు గతంలో ఇచ్చిన మాటను నిలుపుకోలేదు. ఐపీఎల్‌ను విజయవంతం చేయాలనే సదుద్దేశంతో కొన్ని సమస్యలున్నా మేము మౌనంగా ఉంటున్నాం. ఇప్పటికైనా ఈ-మెయిల్స్‌కు స్వస్తి చెప్పి ఎస్ఆర్హెచ్ యాజమాన్యం, సిబ్బందితో మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. విశాల దృక్పథంతో చర్చలకు ముందుకు రావాలని కోరుతున్నాం’ అని హెచ్‌సీఏ లేఖలో పేర్కొంది.