హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల సొసైటీ పరిధిలోని జగదేవ్‌పూర్ బాలికల పాఠశాలలోని సూల్ అండ్ కాలేజ్‌లో బాలికలకు ఏర్పాటు చేసిన నాలుగు రోజుల స్పోర్ట్స్ మీట్‌ను సెక్రటరీ సైదులు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి రావడానికి స్పోర్ట్స్ మీట్లు ఎంతగానో దోహదపడతాయని వివరించారు.
ఈ ఏడాది 12 మంది ఎంజేపీ విద్యార్థినిలు జాతీయస్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారని సంతోషం వ్యక్తం చేశారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ స్పోర్ట్స్ మీట్లో అథ్లెటిక్స్, రన్నింగ్, కబడ్డీ, ఖోఖో, చెస్, వాలీబాల్ లాంటి క్రీడలకు సంబంధించి అండర్ 14, 17,19 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని, మొత్తంగా 1400 బాలికలు, 1400 బాలురు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.