హైదరాబాద్, ఆట ప్రతినిధి: స్పోర్ట్స్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(SATS) చైర్మన్ శివసేనారెడ్డిని స్పోర్ట్స్ జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(SJAT) ప్రతినిధులు కోరారు. మంగళవారం ఎల్బీ స్టేడియంలో అసోసియేషన్ ప్రతినిధులు సాట్స్ చైర్మన్కు వినతిపత్రం అందజేశారు. తెలంగాణలో ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడంతో పాటు క్రీడాభివృద్ధిలో స్పోర్ట్స్ జర్నలిస్టులు, SJAT కీలకంగా వ్యవహరిస్తున్నది.
చాలా కాలంగా క్రీడా పాత్రికేయులుగా సేవలందిస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించి ఇండ్ల స్థలాలు కేటాయించాలని ఎస్జాట్ ప్రతినిధులు కోరారు. ఈ సందర్భంగా శివసేనారెడ్డి మాట్లాడుతూ ‘క్రీడా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో స్పోర్ట్స్ జర్నలిస్టుల పాత్ర విలువైనది. క్రీడా పాత్రికేయుల ఇండ్ల స్థలాల విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ తీసుకుంటాను’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్జాట్ ప్రతినిధులు కృష్ణారెడ్డి, శ్రీనివాస్, సంజయ్, రాజశేఖర్, సాగర్, సునీల్, సాయికిరణ్రెడ్డి, మహేశ్, ప్రేమ్, రానా ప్రతాప్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.